దేశవ్యాప్తంగా చెలరేగిన హింస
అధికార పార్టీ, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు
93 మంది మృతి
ఢాకా(బంగ్లాదేశ్ ), ఆగస్టు 4: బంగ్లాదేశ్ మళ్లీ భగ్గుమంది. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో అట్టుడుకుతున్న పొరుగుదేశంలో మరోసారి హింస చెలరేగింది. దేశమంతా హింసాత్మక ఘటనలతో వణికిపోయింది.
ఆదివారం అధికార పార్టీ మద్దతుదారులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో 93 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 14 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. దేశంలో మళ్లీ ఘర్షణలు చెలరేగడంతో అప్రమత్తమైన ప్రభుత్వం బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి నిరవధిక కర్ఫ్యూ విధించింది.
భారత్ అలర్ట్
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడున్న నివసిస్తున్న పౌరులను భారత్ అప్రమత్తం చేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్‌లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ విడుదల చేసింది.
ప్రధాని రాజీనామాకు డిమాండ్
ఘర్షణల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి. ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చలకు రావాలని ప్రధాని షేక్ హసీనా పిలుపునిచ్చినా ఆందోళనకారులు తిరస్కరించారు. ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడితే సహించేదిలేదని హసీనా అన్నారు.