calender_icon.png 9 October, 2024 | 4:51 PM

బంగ్లాదేశ్ అదుర్స్

04-10-2024 12:05:07 AM

  1. స్కాట్లాండ్‌పై విజయం 
  2. రాణించిన రీతు, శోభన

మహిళల టీ20 ప్రపంచకప్

షార్జా: మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆతి థ్య బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. గ్రూప్-బిలో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన తొలి పోరులో బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటిం గ్ చేసిన బంగ్లాదేశ్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది.

శోభన మోస్త్రే (38 బంతుల్లో 36) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ షతీ రాణి (32 బంతుల్లో 29) పర్వాలేదనిపించింది. స్కాట్లాండ్ వుమెన్ బౌలర్లలో సాస్కియా హోర్లే 3 వికెట్లు తీయగా.. కాథరిన్ ఫ్రేసర్, ఒలివియా బెల్, బ్రైస్‌లు తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం 120 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ బంగ్లా బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులకే పరిమితమై ఓటమి చవిచూసింది.

సారా బ్రైస్ (52 బంతుల్లో 49 నాటౌట్) అజేయంగా నిలిచినప్పటికీ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయింది. బ్రైస్ మినహా మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు. రీతు మోనీ 2 వికెట్లు తీయగా.. మరుఫా అక్తర్, నహిదా అక్తర్, ఫాహిమా కాతున్, రెబెయా ఖాన్‌లు తలా ఒక వికెట్ తీశారు.

లోస్కోరింగ్.. పరమ బోరింగ్

2024 మహిళల ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ చప్పగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్  నిధానంగా ఆడింది. తొలి పవర్ ప్లే ముగిసేసరికి ఆ జట్టు వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. 9.1 ఓవర్లలో 50 పరుగుల మార్క్‌ను దాటిన బంగ్లా మరో 50 పరుగులు చేయడానికి 8.2 ఓవర్లు ఆడడం గమనార్హం. అయితే స్కాట్లాండ్ జట్టు కాస్త బలహీనంగా ఉండడం బంగ్లాకు కలిసొచ్చింది. టార్గెట్ తక్కువే అయినప్పటికీ బంగ్లా మహిళలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కాట్లాండ్ ఓటమి దిశగా పయనించింది.

సంక్షిప్త స్కోర్లు

బంగ్లాదేశ్: 20 ఓవర్లలో 119/7 

(శోభన 36, షతీ రాణి 29 ; హోర్లే 3/13),

స్కాట్లాండ్: 20 ఓవర్లలో 103/7 

(బ్రైస్ 49 నాటౌట్; అలిసా 11; రీతు 2/15)

నేటి మ్యాచ్‌లు

సౌతాఫ్రికా x వెస్టిండీస్

మధ్యాహ్నం 3.30 గంటలు, దుబాయ్

భారత్ x న్యూజిలాండ్

రాత్రి 7.30 గంటలు, దుబాయ్