calender_icon.png 19 November, 2024 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌కు బంగ్లా టెర్రర్ ముప్పు

13-08-2024 12:12:47 AM

  1. హసీనా ప్రభుత్వం కూలిపోవడమే కారణం
  2. గతంలో ఉగ్ర సంస్థలపై ఉక్కుపాదం మోపిన మాజీ ప్రధాని
  3. ప్రస్తుతం తాత్కాలిక సర్కారులో పెట్రేగిపోయే అవకాశం
  4. ఇప్పటికే యాక్టివ్‌గా మారిన పలు ఉగ్రసంస్థలు
  5. హెచ్చరిస్తున్న నిఘా సంస్థలు

న్యూఢిల్లీ, ఆగస్టు 12: బంగ్లాదేశ్‌లో నెలకొన్న అశాంతితో భారత్‌కు ముప్పు పొంచి ఉంది. ఈ మేరకు ఉగ్రవాద సంస్థలు పెట్రేగిపోతాయ ని నిఘా వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్‌లో నిరసనలకు విద్యార్థులే నాయకత్వం వహించినప్పటికీ ఇంటెలిజెన్స్ నివేదికలు మాత్రం హింసకు దారితీయడం ముఖ్యంగా హిందువులే లక్ష్యంగా దాడులు జరగడంపై ఉగ్రవాద సంస్థల హస్తం ఉందని వెల్లడిస్తున్నాయి.

అందులో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయి బా ప్రమేయముందని తెలుస్తోంది. బంగ్లాదేశ్‌కు చెందిన అన్సరుల్లా బంగ్లా టీం (ఏబీటీ)తో కలిసి భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో పలుమార్లు లష్కర్ దాడులు చేసినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా బంగ్లా ప్రభుత్వం కూలడంలో పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నాయి. జమాతే ఇస్లామీతో పాటు అనేక నిషేధ సంస్థల సహకారంతో హసీనా ప్రభుత్వాన్ని కూల్చాయని తెలిపాయి. 

ఈశాన్య రాష్ట్రాల్లో దాడులు

భారత్‌లో దాడులు చేయడమే లక్ష్యంగా బెంగాల్ కేంద్రంగా ఏర్పాటయిన ఏబీటీతో 2022లో లష్కరే జతకట్టింది. త్రిపురలో జరిగిన ఘటనను పరిశీలిస్తే ఎక్కువగా మసీదులకు నష్టం జరిగినట్లుగా నివేదికలు పేర్కొన్నాయి. కానీ ఈ ప్రాంతంలో హిందూ మెజారిటీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఏబీటీని లష్కరే ప్రేరేపించిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. 2022 నుంచి త్రిపురలోకి చొరబడేందుకు 50 నుంచి 100 మంది ప్రయత్నించినట్లు తెలిపాయి. అదే ఏడాది ఏబీటీతో సంబంధమున్న అనేక మంది ఉగ్రవాదులను అస్సాంలో అరెస్టు చేయడం గమనార్హం.

నిజానికి ఏబీటీ జమాత్ ఉల్ ముస్లిమీన్ అనే పేరుతో 2007లో స్థాపించారు. ఇందుకు ఓ ఎన్‌జీవో నిధులు అందించింది. కానీ ఆర్థిక పరమైన కారణాలతో ఆ సంస్థ కనుమరుగైంది. 2013లో అన్సరుల్లా బంగ్లా టీమ్‌గా మళ్లీ వెలుగులోకి వచ్చింది. దీనిపై 2013లో నిషేధం విధించగా అన్సార్ అల్ ఇస్లామ్‌గా పేరు మార్చుకుంది. దీన్ని కూడా 2017లో నిషేధించారు. అప్పటినుంచి ఈ సంస్థ బంగ్లాలో అనేక మంది హత్యలకు కారణమైంది. అల్‌ఖైదా ప్రధాన విభాగంగా బంగ్లాలో స్థానం సంపాదించుకుంది. 

గతంలో భారీగా అరెస్టులు

దక్షిణాసియా టెర్రరిజం పోర్టల్ ప్రకారం 2013 నుంచి బంగ్లాదేశ్‌లో సుమారు 400కుపైగా ఏబీటీ సభ్యులు అరెస్ట్ అయ్యారు. ఈ సంస్థల నుంచి భారత్‌కు ఎప్పటి నుంచో ముప్పు పొంచి ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిజానికి హసీనా ప్రభుత్వం ఇలాంటి ఉగ్రవాద సంస్థలను అరికట్టేందుకు కఠిన చర్య లు తీసుకున్నారు. అయితే, ఆమె ప్రభుత్వం ఇప్పుడు లేకపోవడంతో ఇలాంటి సంస్థలు మ ళ్లీ తెరపైకి వచ్చే అవకాశముందని నిఘా వర్గా లు అంచనా వేస్తున్నాయి. తద్వారా భారత్‌కు భారీ ప్రమాదముందని హెచ్చరిస్తున్నాయి. 

బంగ్లాదేశ్‌లో యాక్టివ్‌గా ఉన్న ఇస్లామిక్ టెర్రరిస్ట్ సంస్థలు ఇవే.. 

1. అన్సరుల్లా బంగ్లా టీం (ఏబీటీ)

2. అన్సార్ అల్ ఇస్లాం

3. లష్కరే తొయిబా

4. హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ బంగ్లాదేశ్

5. జాగ్రతా ముస్లిం జనతా బంగ్లాదేశ్

6. జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్

7. పర్బా బంగ్లార్ కమ్యూనిస్ట్ పార్టీ

8. ఇస్లామి ఛాత్ర శిబిర్

9. ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)