calender_icon.png 11 October, 2024 | 6:50 AM

బంగ్లా ఖేల్ ఖతం

02-10-2024 12:00:00 AM

  1. ఆరు సెషన్లలోనే ముగింపు
  2. 2-0తో టెస్టు సిరీస్ భారత్ సొంతం 
  3. స్వదేశంలో వరుసగా 18వ సిరీస్ విజయం
  4. అక్టోబర్ 6 నుంచి టీ20 సిరీస్

* పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై వైట్ వాష్ చేశాం.. పసికూనలం కాదు.. బెబ్బులిలా విరుచుకుపడతాం.. భారత్‌పై మా దమ్ము చూపిస్తామని బంగ్లాదేశ్ ప్రగల్బాలు పలికింది. కట్ చేస్తే.. తొలి టెస్టులో ఘోర ఓటమి.. రెండో టెస్టులో బంగ్లాకు వరుణుడు ఆపద్భాందవుడయ్యాడు.

దీంతో రెండున్నర రోజులకు పైగా ఆట తుడిచిపెట్టుకుపోవడంతో డ్రా అవుతుందని అంతా భావించారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అనూహ్య విజయంతో బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ సొంతగడ్డపై తమకు ఎదురులేదని నిరూపించింది.

11 టెస్టుల్లో అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకోవడం ఇది పదకొండోసారి.

18 స్వదేశంలో (2013-2024 మధ్య) భారత్ వరుసగా గెలిచిన టెస్టు సిరీస్‌ల సంఖ్య. 

కాన్పూర్: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరుణుడి దెబ్బకు ఎనిమిది సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోయినప్పటికీ భారత్ గొప్ప ప్రదర్శనతో బంగ్లాకు ఓటమి రుచి చూపించింది.

డబ్యూటీసీ టేబుల్‌లో 74.24 పాయింట్లతో అగ్ర స్థానాన్ని మరింత పదిలపరు చుకున్న భార త్ డబ్ల్యుటీసీ ఫైనల్ (2025)కు మరింత చేరువైంది. ఓవర్‌నైట్ స్కోరు 26/2తో ఐదోరోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి తొలి సెషన్‌లోనే 146 పరుగులకే కుప్పకూలింది.

అనంతరం 95 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ 17.2 ఓవర్లలోనే చేధించింది. తొలి ఇన్నింగ్స్‌లో రాణించిన జైస్వాల్ (45 బంతుల్లో 51)మరోమారు అర్థసెంచరీతో మెరిశాడు. రెండు ఇన్నింగ్స్‌లోనూ అర్థసెంచరీలు సాధి ంచిన జైస్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’.. సిరీస్‌లో సెంచరీతో పాటు 11 వికెట్లు పడగొట్టిన అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ దక్కించుకున్నారు.

నయా కోచ్.. అదిరెన్ సోచ్ 

కొత్త కోచ్ గంభీర్ టెస్టు ప్రయాణం ఈ సిరీస్‌తోనే ఆరంభం అయింది. గంభీర్ తన మార్కును ఎలా చూపిస్తాడా అని అంతా ఎదురుచూశారు. తొలి ప్రయత్నంలోనే గంభీర్ తన మార్కును చూపెట్టాడు. నెమ్మదిగా ఆడాల్సిన టెస్టు మ్యాచ్‌లో మన బ్యాటర్లు టీ20 తరహాలో బ్యాటింగ్ చేయడం వెనుక గంభీర్ మాస్టర్ ప్లాన్ దాగుంది. ఈ సిరీస్ విజయం గంభీర్‌కు మంచి బూస్టప్. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్  బంగ్లాతో టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. మూడు అర్థసెంచరీలు సాధించిన జైస్వాల్ 189 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

షకీబ్‌కు కోహ్లీ కానుక..

మ్యాచ్ విజయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. 100లోపు ఆలౌట్ అయినా పర్లేదు కానీ వేగంగా పరుగులు చేయాలనే మైండ్‌సెట్‌తో ఆడామని పేర్కొన్నాడు. బంగ్లాపై సిరీస్ విజయం మాలో ఆత్మవిశ్వాసం పెంచిందన్నాడు. బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన తన బ్యాటును కానుకగా అందించాడు. బంగ్లా తరఫున 71 టెస్టులాడిన షకీబ్‌కు బహుశా ఇదే చివరి టెస్టు అయ్యే అవకాశముంది.

4300 రోజులకు పైగా..

సొంతగడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ కోల్పోయి 12 ఏళ్లు కావొస్తోంది. చివరగా ఎంఎస్ ధోని నాయకత్వంలోని భారత జట్టు 2012/13 సీజన్‌లో 1-2 తేడాతో ఇంగ్లండ్‌కు సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత నుంచి స్వదేశంలో ఒకట్రెండు మ్యాచ్‌లు మినహా పుష్కరకాలంగా ఓటమి ఎరుగని భారత్ జైత్రయాత్రను కొనసాగిస్తూ 18 టెస్టు సిరీస్‌లను వరుసగా గెలుచుకోవడం విశేషం. తాజాగా బంగ్లాను  క్లీన్‌స్వీప్ చేసిన భారత్ 4300కి పైగా రోజుల నుంచి స్వదేశంలో గెలుస్తూ వస్తోంది. ఇంతకముందు సౌతాఫ్రికా (1704 రోజులు), ఆస్ట్రేలియా (1348 రోజుల పాటు*)స్వదేశంలో ఒక్క టెస్టు సిరీస్‌ను కోల్పోలేదు.