calender_icon.png 24 September, 2024 | 7:47 AM

పాక్ చెరలోకి వెళ్తున్న బంగ్లా

21-09-2024 02:42:48 AM

ఢాకాలో జిన్నా వర్ధంతిని ఘనంగా నిర్వహణ

జిన్నా లేకుండా బంగ్లాదేశ్ లేదని వక్తల ప్రసంగాలు

ఆయన్ను బంగ్లా జాతిపితగా గౌరవించాలని ప్రతిపాదన

పాక్‌తో సంబంధాలు పెంచుకోవాలని సూచనలు

కార్యక్రమానికి హాజరైన బంగ్లాలోని పాక్ డిప్యూటీ హైకమిషనర్

హసీనా నిష్క్రమణతో భారత్‌పై పెరుగుతోన్న వ్యతిరేకత

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: బంగ్లాదేశ్‌లో రాజకీయ, జాతీయవాద పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత పాకిస్థాన్‌వైపు తమ దేశాన్ని మళ్లించేందుకు ప్రస్తుత పాలకులు, ఇస్లాంవాదులు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. పాక్‌లో భాగంగా తూర్పు పాకిస్థాన్‌గా ఉన్న ఒకప్పటి బంగ్లాదేశ్‌లో మొదటి నుంచి ఉర్దూ, మహమ్మద్ అలీ జిన్నా మీద తీవ్ర వ్యతిరేకత ఉండేది. కానీ, సెప్టెంబర్ 11న జిన్నా 76వ వర్ధంతిని ఢాకా నేషనల్ ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు.

ఇన్నాళ్లు బద్ధశత్రువుగా భావించే జిన్నాను కీర్తిస్తూ, వాళ్లు ద్వేషించే ఉర్దూలోనే పాటలు పాడారు. ఈ సందర్భంగా ప్రసంగాలు చేసిన కొందరు వక్తలు జిన్నాను జాతిపితగా పేర్కొనాలని పిలుపునివ్వడం కొసమెరుపు. ఈ పరిణామాలను గమనిస్తే మళ్లీ పాక్ కబంధ హస్తాల్లోకి వెళ్లే అవకాశముందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బంగ్లాలో పాకిస్థాన్ డిప్యూటీ హైకమిషనర్ కమ్రాన్ దంగల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జిన్నా లేకపోతే అసలు బంగ్లాదేశ్ వచ్చేది కాదని వక్తలు పేర్కొన్నారు. అందుకు ఆయనకు రుణపడి ఉన్నామని ఉద్ఘాటించారు. 

జిన్నాపై మమకారం

జిన్నా లేకుంటే పాకిస్థాన్ ఉండేది కాదు. పాకిస్థాన్ లేకుండా బంగ్లాదేశ్ ఉనికిలోకి రాకపోయేది. జిన్నా మన జాతి పితామహుడు. కానీ మనం దీన్ని గుర్తించలేకపోతున్నాం. మనం మన సౌభ్రాతృత్వాన్ని కాపాడుకోవాలి. జిన్నా జయంతి, వర్ధంతిని ఏటా జరుపుకోవాలి అని బంగ్లా నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నేత నజ్రుల్ ఇస్లాం వ్యాఖ్యానించారు. పరిషద్ అధ్యక్షుడు శంషుద్దీన్ ప్రసంగిస్తూ.. జిన్నా కృషి వల్ల తూర్పు బెంగాల్.. ఈస్ట్ పాకిస్థాన్‌గా మారింది. లేదంటే అది భారత్‌లో భాగమై ఉండేది. ఈ రోజు మన పరిస్థితి కశ్మీర్‌లా ఉండేది. పాకిస్థాన్ వల్లనే బంగ్లాకు స్వాతంత్య్రం లభించింది. ఇందులో జిన్నాదే కీలక పాత్ర అని చెప్పగా సభికులు పెద్దఎత్తున చప్పట్లు కొట్టారు.

ఈ కార్యక్రమంలో బంగ్లా సాయుధ దళాల విశ్రాంత అధికారులు, హసీనా పార్టీ అవామీలీగ్‌ను వ్యతిరేకించే నాయకులు, దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తాత్కాలిక ప్రభుత్వ మద్దతుదారులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన విద్యార్థి నేతలకు సన్నిహితంగా ఉండే నేత ఎండీ షెకావత్ మాట్లాడుతూ.. తూర్పు బెంగాల్‌ను పాకిస్థాన్‌లో భాగం చేయాలని జిన్నా పట్టుబట్టకపోతే ఇప్పుడు మనం భారత్‌లో వెనుకబడిన, నిర్లక్ష్యానికి గురైన పశ్చిమబెంగాల్ రాష్ట్రంగా ఉండేవాళ్లమని అన్నారు. మన పరిస్థితి దయనీయంగా, పొరుగుదేశంలో హింసకు, దోపిడీకి గురయ్యే రెండో తరగతి పౌరులుగా జీవించే ముస్లింల వలె ఉండేవాళ్లమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన వక్తలందరూ పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకోవాలని స్పష్టం చేశారు. పాక్ జెండాలను సైతం ప్రదర్శించారు. 

1971కు ముందు మారణకాండ

భారత్ నుంచి పాక్ విడిపోయిన తర్వాత తూర్పు, పశ్చిమ పాకిస్థాన్‌లో ఉర్దూ ఏకైక అధికార భాషగా ఉంటుందని జిన్నా చేసిన ప్రకటన బెంగాలీ జాతీయవాదాన్ని నిద్రలేపింది. ఈ పోరాటం చివరికి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసింది. 1971 వరకు బెంగాలీ జాతీయవాదులపై పశ్చిమ పాక్ సైన్యం, ఇస్లామిస్టులు మద్దతుదారులు పాల్పడిన నేరాల గురించి ఎవరూ పట్టించుకునే వారు కాదు. దాదాపు 30 లక్షల బెంగాలీలపై హత్య, అత్యాచారానికి పాల్పడ్డారు. 1971 మార్చి నుంచి నవంబర్ మధ్య 4 లక్షల మంది బెంగాలీ మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా.