calender_icon.png 18 January, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాణిజ్యంపై బంగ్లా ఎఫెక్ట్

08-08-2024 12:19:07 AM

ఉల్లి ఎగుమతులపై ప్రభావం

సరిహద్దుల్లో నిలిచినపోయిన 80 లారీలు

వెనక్కి రాకుండా వేచి చూస్తోన్న వ్యాపారులు

ఆందోళనలో భారత ఉల్లి రైతులు

న్యూఢిల్లీ, ఆగస్టు 7: బంగ్లాదేశ్ సంక్షోభం భారత ఉల్లి రైతులపై పడింది. బంగ్లాతో వాణిజ్యంపై అక్కడి పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్ జిల్లా చంగ్రబంధ సరిహద్దులో దాదాపు 80 ఉల్లి ట్రక్కులు సోమవారం మధ్యాహ్నం నుంచి నిలిచిపోయాయి. వీటిలో నాసిక్‌కు చెందినవి 45 లారీలు, మహారాష్ట్రలోని ఇతర జిల్లాలకు చెందిన మరో 10 లారీలు, మధ్యప్రదేశ్‌కు చెందిన 25 లారీలు ఉన్నాయని హార్టికల్చర్ ప్రొడ్యూస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (హెచ్‌పీఈఏ) తెలిపింది. బంగ్లాదేశ్ సంక్షోభం కారణంగా రెండు దేశాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం సరిహద్దుల్లో నిలిచిన ట్రక్కుల్లో 25 టన్నుల ఉల్లి ఉన్నట్లు ఎగుమతిదారులు చెబుతున్నారు. కాగా ఇటీవల 80 వేల టన్నుల ఉల్లిని బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేసేందుకు రైతులకు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. 

రైతుల్లో ఆందోళన

భారత్ గతేడాది ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. కానీ కొన్ని దేశాలకు మాత్రం ఎగుమతులను కొనసాగిస్తోంది. అందులో బంగ్లాదేశ్ ఒకటి. కానీ, టన్నుకు కనీస ఎగుమతి ధరగా 550 డాలర్లుగా నిర్ణయించింది. భారత్ ఉల్లికి బంగ్లాలో డిమాండ్‌కు అనుగుణంగా అదనంగా 40 శాతం సుంకాన్ని విధించింది. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు 50 ట్రక్కులు బార్డర్ దాటాయి. ఆ తర్వాత సరిహద్దును మూసేయడంతో మిగిలిన ట్రక్కులు నిలిచిపోయాయి. దీంతో వెనక్కు రాకుండా వేచి చూద్దామని వ్యాపారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కానీ తమ వాహనాలను బంగ్లాదేశ్‌లోకి ఎప్పుడు అనుమతిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల నడుమ అదనపు ట్రక్కులను పంపే ఉద్దేశాన్ని ఉల్లి వ్యాపారులు మానుకున్నారని ననాసిక్‌కు చెందిన వ్యాపారి మనోజ్ జైన్ తెలిపారు. నిరవధికంగా ట్రక్కులు నిలిచిపోతే ఉల్లి పాడయ్యే ప్రమాదముందని రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిపై స్వాభిమాని షెట్కారీ సంఘటన్ అధ్యక్షుడు రాజుశెట్టి.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాన్ని సంప్రదిఇంచి సరిహద్దులో నిలిచిన ట్రక్కులకు అనుమతి ఇప్పించాలని కోరారు. కాగా, లాసల్‌గావ్‌లో ఉల్లి టోకు ధర మంగళవారం క్వింటాల్‌కు 2,900గా ఉండగా సోమవారం రూ.2,851గా ఉంది. 

భారత్‌కు అతిపెద్ద మార్కెట్

భారత్‌కు బంగ్లాదేశ్ అతిపెద్ద ఉల్లి మార్కెట్‌గా ఉంది. మన దేశం చేసే ఉల్లి ఎగుమతుల్లో 24 శాతం బంగ్లాదేశ్‌కే వెళతాయి. ఉల్లి ఎగుమతులపై నిషేధానికి ముందు ఏటా ప్రపంచవ్యాప్తంగా 26 లక్షల టన్నుల ఉల్లిని భారత్ ఎక్స్‌పోర్ట్ చేసేది. అందులో 6 లక్షల టన్నుల ఉల్లిని బంగ్లాదేశ్ దిగుమతి చేసుకునేది. అందువల్ల దేశంలోని ఉల్లి రైతులు బంగ్లా ఎగుమతులపైనే ఎక్కువ ఆధారపడుతారు. ప్రస్తుతం ఎగుమతులు నిలిచిపోవడంతో ఉల్లి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది నిషేధం తర్వాత బంగ్లాదేశ్‌కు ఎగుమతిని కేంద్రం కొనసాగించినా సుంకాన్ని పెంచి పరిమాణాన్ని తగ్గించింది. దీంతో బంగ్లాదేశ్ ఉల్లి కోసం ఇతర దేశాలపై ఆధారపడింది. ప్రస్తుతం పాకిస్థాన్ నుంచి వచ్చే ఉల్లిపాయలు భారత్ కన్నా టన్నుకు 100 డాలర్లు తక్కువగా లభిస్తున్నాయి. 

పాక్ రెండో ప్రాధాన్యమే..

భారత్ ఉల్లిపాయలే ఎక్కువ రుచిని ఇస్తుండటంతో అక్కడి ప్రజలు వీటినే ఇష్టపడుతారని ఉల్లి వ్యాపారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత గందరగోళ పరిస్థితుల్లో వాణిజ్యాన్ని తాత్కాలికంగా నిలిపివేసినా తిరిగి భారత ఉల్లికి డిమాండ్ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాక్ ఉల్లికి బంగ్లా ఎప్పుడూ రెండో ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. అయితే, ఎగుమతి సుంకాన్ని ఎత్తివేయాలని వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎందుకంటే ఈ ఏడాది చివరినాటికి బంగ్లాలో పరిస్థితులు మెరుగుపడే అవకాశముందని, అప్పటికి పంట కూడా చేతికి వస్తుందని చెబుతున్నారు. ఆ సమయానికి ధరలు తగ్గితే ఎగుమతులు మళ్లీ ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.