calender_icon.png 11 October, 2024 | 7:52 PM

బంగ్లా దాసోహం

10-10-2024 12:00:00 AM

టీమిండియాదే రెండో టీ20

  1. నితీశ్, రింకూ అర్థ శతకాలు 
  2. బౌలర్ల సమిష్టి ప్రదర్శన

ఢిల్లీ: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. బుధవారం ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

హైదరాబాదీ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (34 బంతుల్లో 74; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. రింకూ సింగ్ (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్థసెంచరీ సాధించాడు. హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 32) మరోసారి మెరిశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హొసెన్ 3 వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, తంజిమ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. 

అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లా దేశ్ భారత బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 పరుగులకు పరిమితమైంది. బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా (41) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన నితీశ్ రెడ్డికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

నితీశ్ అదుర్స్.. బంగ్లా బెదుర్స్

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. సంజూ శాంసన్ (9), అభిషేక్ (15), కెప్టెన్ సూర్య (8) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో పవర్ ప్లే (తొలి ఆరు ఓవర్లు) ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నితీశ్ కుమార్, రింకూ సింగ్ బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డారు.

ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు వందకు పైగా పరుగులు జోడించారు. 27 బంతుల్లో అర్థసెంచరీ పూర్తి చేసుకున్న నితీశ్ ఆ తర్వాత సిక్సర్లు, బౌండరీలు బాదుతూ మరింత రెచ్చిపోయాడు. నితీశ్  ఔట్ కాగానే ఆ బాధ్యతను రింకూ ఎత్తుకున్నాడు. అతనికి తోడు హార్దిక్ కూడా బ్యాట్ ఝలిపించడం తో భారత్ 18.2 ఓవర్లలో 200 పరుగుల మార్క్‌ను దాటింది.

ఈ క్రమంలో టీమిండి యా వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ.. ఆఖర్లో అర్ష్‌దీప్, పరాగ్ సిక్సర్లు బాదడంతో భారత్ భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో పూర్తిగా తడబడిన బంగ్లా 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ రన్‌రేట్ పెరిగిపోవడం.. భారత బౌలర్లు క్రమంగా వికెట్లు తీయడంతో బంగ్లా ఓటమి చవిచూసింది.