- విద్యార్థుల అల్టిమేటంతో వైదొలిగిన ఒబైదుల్లా
- సుప్రీంకోర్టును ముట్టడించిన ఆందోళనకారులు
- విధిలేక పదవి నుంచి తప్పుకొన్న చీఫ్ జస్టిస్
- బంగ్లాదేశ్ బ్యాంకు గవర్నర్ కూడా గుడ్‌బై
ఢాకా, ఆగస్టు 10: బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా ఆందోళనలు, ఆటవిక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తమకు నచ్చని ఏ అధికారినీ, నేతనూ వదలకుండా ఆందోళనకారులు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా శనివారం ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్లా హసన్‌ను బలవంతంగా రాజీనామా చేయించారు.
మీటింగ్‌తో ఊడిన పదవి
బంగ్లాదేశ్‌లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న అరాచకాల నేపథ్యంలో ఒబైదుల్లా సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులందరితో ఫుల్ బెంచ్ సమావేశానికి పిలుపునిచ్చారు. శనివారం ఆ సమావేశం జరగాల్సి ఉన్నది. ఈ విష యం తెలుసుకొన్న విద్యార్థులు న్యాయ వ్యవస్థ తమ ఉద్యమాన్ని అడ్డుకొంటుందని భయపడ్డారు. దీంతో వేలమంది విద్యార్థులు సుప్రీం కోర్టును చుట్టుముట్టారు. ప్రధాన న్యాయమూర్తి ఒక గంటలో రాజీనామా చేయాలని అల్టిమేటం జారీచేశారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఒబైదుల్లా ప్రతిపాదిత సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించనప్పటికీ ప్రయోజనం లేకపోయింది. విద్యార్థులు పట్టువిడువకపోవటం, కోర్టులోకి ప్రవేశిస్తామని హెచ్చరించటంతో చివరకు ఆయన పదవి నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని దేశాధ్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్‌కు తెలియజేశారు. ఒబైదుల్లాకు షేక్ హసీనా అనుకూలుడిగా పేరుంది.
బంగ్లాదేశ్ బ్యాంకు గవర్నర్ కూడా..
ఆందోళనకారుల హెచ్చరికతో బంగ్లాదేశ్ రిజర్వ్‌బ్యాంకు గవర్నర్ అబ్దుర్ రవుఫ్ తాలుక్‌దార్ కూడా శనివారం రాజీనామా చేశారు. కొద్దిరోజుల క్రితం దాదాపు 400 మంది బ్యాంకు ఉద్యోగులు ఉన్నతాధికారుల అవినీతిపై తీవ్ర ఆరోపణలు చేయటంతో నలుగురు డిఫ్యూటీ గవర్నర్లు రాజీనామా చేశారు. అయితే, తాలుక్‌దార్ రాజీనామాను ఇంకా ఆమోదించలేదని ఆ దేశ ఆర్థిక శాఖ సలహాదారు సలేహుద్దీన్ అహ్మద్ తెలిపారు. కాగా, దేశం విడిచి పారిపోయిన మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి తీసుకొచ్చి చట్టంముందు నిలబెడుతామని ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నేత అమీర్ ఖుస్రూ మహ్ముద్ చౌదరి తెలిపారు.