calender_icon.png 8 November, 2024 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువుల పునరుద్ధరణలో బెంగళూరు భేష్

08-11-2024 12:00:00 AM

  1. అక్కడి విధానాలను హైదరాబాద్‌లో అమలు చేస్తాం  
  2. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 7 (విజయక్రాంతి): చెరువుల పునరుద్ధరణ, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణలో బెంగళూరు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను ప్రభుత్వంతో చర్చించి హైదరాబాద్ నగరంలోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. బెంగళూరులో చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణపై అధ్యయనం చేసేందుకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో రీజినల్ ఫైర్ ఆఫీసర్లు వీ పాపయ్య, ఏ జయప్రకాశ్, ఏఈ నాగరాజు, ఇన్‌స్పెక్టర్ విజయ్ ఆదిత్య తదితరులు మూడ్రోజుల బెంగళూరు పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.

పర్యటనలో భాగంగా తొలిరోజు గురువారం కర్నాటక నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్‌ను హైడ్రా అధికారులు సందర్శించారు. ఈ కేంద్రంలో వర్షపాతం నమోదు, గాలి వేగం, ఉష్ణోగ్రతల వివరాలు వెల్లడించే వాతావరణ కేంద్రాన్ని పరిశీలించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు వినియోగించే మేఘ సందేశం యాప్ పనితీరును పరిశీలించారు. స్థానిక యలహంక, జక్కూ ర్ చెరువులను పునరుద్ధరించిన తీరును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువుల్లోకి వచ్చే మురుగును ఎస్‌టీపీల ద్వారా శుద్ధి చేసే విధానం, ఆ తర్వాత చెరువుల పునరుద్ధరణకు అనుసరిస్తున్న విధానాలను బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) అధికారులను అడిగి తెలుసుకున్నారు.