- హైదరాబాద్ నుంచి ఎలివేటెడ్ హైస్పీడ్ రైల్వే కారిడార్లు
- గంటకు 350 కి.మీ.తో హైస్పీడ్ రైల్
- సర్వే కోసం రూ.33కోట్లతో టెండర్లను ఆహ్వానించిన దక్షిణమధ్య రైల్వే
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా లకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు మధ్య ఎలివేటెడ్ హైస్పీడ్ రైల్వే కారిడార్ల నిర్మాణానికి కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా ఈ రెండు ప్రాజెక్టుల లైడార్ సర్వే కోసం టెండర్లు జారీ చేసింది.
ఈ నెల 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. రూ.33కోట్లతో రైల్వే శాఖ ఈ టెండర్లను జారీ చేసింది. టెండర్లు దక్కించుకున్న సంస్థ 8 నెలల్లో సర్వే పూర్తి చేయాల్సి ఉంది. ఫైనల్ లొకేషన్ సర్వే, డిజైన్లు, డీపీఆర్ సమర్పించాల్సి ఉంటుం ది.
ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం లాభదాయకంగా ఉండేలా, దగ్గరి మార్గంలో చేరుకునేలా ఉండాలి. కేవలం 2 గంటల్లో బెంగళూరు, చెన్నై చేరుకునేలా ఈ నిర్మాణం ఉండబోతున్న నేప థ్యంలో సర్వే కూడా ఆ మేరకే ఉండాల్సి ఉంటుంది. ఎయిర్‌బోర్న్ లేదా లైడార్ ద్వారా కచ్చితమైన సర్వే నిర్వహించాలి.
హైదరాబాద్- చెన్నై
హైదరాబాద్- చెన్ను (సుమారు 620 కి.మీ.) మేర సర్వే చేపట్టాలి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కర్నూలు, రేణిగుంట మీదుగా, మరో లైన్ గుంటూరు మీదుగా చెన్నై వెళ్లేందుకు రైల్వే సదుపాయం ఉంది. వాడి-రాయచూరు మీదుగానూ చెన్నై వెళ్లేందుకు అవకాశం ఉంది.
అయితే ఇందులో ఏ మార్గంలో వెళ్తే దగ్గరవుతుందో అనే అంశాలతో పాటు హైస్పీడ్ రైల్వే కారిడార్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆర్థికంగా కూడా లాభసాటిగా ఉండేలా సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్- సూర్యాపేట- అమరావతి- తిరుపతి మీదుగా ఓ ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది.
మరో వైపు కాజీపేట-విజయవాడ మీదుగా కూడా చెన్నై హైస్పీడ్ రైలు ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజధాని అమరావతిని కూడా కవర్ చేసేందుకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఇక కర్నూలు మీదుగా బెంగళూరుకు నిర్మించే హైస్పీడ్ రైలు కారిడార్‌లో లింక్ తీసుకుని తిరుపతి మీదుగా చెన్నైకు లైన్ నిర్మించేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి.
హైదరాబాద్- బెంగళూరు
హైదరాబాద్- బెంగళూరు (సుమారు 570 కి.మీ.) మధ్య ఎలివేటెడ్ రైల్ రైల్వే కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ నిర్దేశిస్తోంది. హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూల్, అనంతపురం మీదుగా బెంగళూరుకు ఈ కారిడార్ నిర్మించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. సాధ్యమైనంత మేరకు స్ట్రెయిట్ లైన్ వస్తుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.
గంటకు 350 కి.మీ. వేగంతో నిర్మించే ఈ కారిడార్‌లో 320 కి.మీ. స్పీడ్‌తో రైళ్లు నడుస్తాయి. అంటే కేవలం 2 గంటల్లోపే బెంగళూరుకు వెళ్లవచ్చు. ఈ హైస్పీడ్ కారిడార్ పూర్తయితే ఇక్కడి వారు అక్కడ..అక్కడి వారు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు.
హైస్పీడ్ రైల్వే కారిడార్‌తో లాభాలెన్నో..
* రాష్ట్రాల మధ్య అనుసంధానం పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధికి అవకాశాలు విస్తృతం అవుతాయి. రైలు మార్గం వెంబడి ఉన్న నగరాలు, పట్టణాలు ప్రముఖ వాణిజ్య కేంద్రాలుగా అభివృద్ధి చెందుతాయి.
* రియల్ ఎస్టేట్, హోటళ్లు, పర్యాటకం తదితర రంగాలు అభివృద్ధి చెందుతాయి.
* కర్బన ఉద్గారాలు తగ్గింపునకు అవకాశం ఏర్పడుతుంది. విమానాలు, ప్రైవేట్ వాహనాల కంటే హైస్పీడ్ రైల్ మిన్న అనే పరిస్థితి వస్తుంది. విమాన ప్రయాణాలతో పోలిస్తే అత్యంత భద్రత లభిస్తుంది.
* హైదరాబాద్ -- చెన్ను -- బెంగళూరు వంటి ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీ మెరుగవుతుంది. వ్యాపార, పరిశ్రమల అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది
* ముంబై-- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ 508 కిమీ ప్రాజెక్ట్‌కు మొత్తం అంచనా ఖర్చు రూ. 1.08 లక్షల కోట్లు. ఇందులో కి.మీ.కు సుమారు రూ. 213 కోట్లు ఖర్చు అవుతోంది. హైదరాబాద్- చెన్నై, బెంగళూరు కారిడార్‌కు కి.మీ.కు రూ. 250 నుంచి రూ.300 కోట్లు అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.