calender_icon.png 12 January, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా బండి సంజయ్ మాటలు

12-01-2025 12:43:51 AM

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్, జనవరి 10 (విజయ క్రాంతి): కూట్లో రాయి తీయనోడు, ఏట్లో రాయి తీస్తా అన్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీరు ఉందని, బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి కోసమే ఆయన నిత్యం ఊబలాట పడుతూ, సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై విచక్షణ కోల్పోయి చౌకబారు విమర్శలు చేస్తున్నారని,బండి సంజయ్ కుమార్ మాటలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు.

శనివారం నగరంలోని సుడా కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఇప్పటితో మూడుసార్లు అధికారంలో ఉన్న బిజెపి పార్టీ నాడు బీఆర్‌ఎస్ పార్టీ చేసిన అవినీతిపై చిత్తశుద్ధితో విచారణ జరిపి ఉంటే నేడు రాష్ట్రం లక్షల కోట్ల అప్పులతో దివాలా తీసి ఉండేది కాదని దుయ్య బట్టారు.

నాడు పిసిసి అధ్యక్షునిగా ఉన్న ప్రస్తుత సిఎం  రేవంత్ రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీకి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం లా మారిందని, కేంద్రం పరిధిలోని అనుమతులు ప్రాజెక్టులకు ఏవిధంగా వస్తున్నాయని ప్రశ్నిస్తే, కనీసం చీమ కుట్టినట్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి స్పందించలేదని, చిన్న లొట్ట పీస్ కేసును కూడా కేసీఆర్ పై పెట్టలేదని ఆరోపించారు.

ఇటువంటి  చరిత్ర గల బిజెపి నేతలు, కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన ఏడాదిలో అభివృద్ధి సంక్షే మమే ఎజెండాగా, ప్రజా పాలనతో ముందుకెళ్తుంటే, బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బిఆర్‌ఎస్ పార్టీ చేసిన అవినీతిని బయటికి తీసి, చిత్తశుద్ధితో ఫార్ములా వన్ ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ పై చర్యలు తీసుకుంటుందని గుర్తు చేశారు.

బిఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ బాధ్యతగా అడ్డుకొని ఉంటే, నేడు తెలంగాణ లక్ష కోట్ల సంపాదన దుర్వినియోగం కాకుండా ఉండేదన్నారు.  కనీసం ఒక్క రూపాయి నిదులైనా  కేంద్రం నుండి తెచ్చి కరీంనగర్ అభివృద్ధిలో భాగస్వామి అయ్యారా అని ప్రశ్నించారు.

ఇకనైనా తమ పార్టీ అగ్ర నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పై, కాంగ్రెస్ పార్టీపై అర్థరహిత విమర్శలు చేస్తే సహించేది లేదని నరేందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ  సమావేశంలో  నాయకులు ఎండి తాజ్, శ్రవణ్ నాయక్, ఆర్ష మల్లేశం, ఆకుల నర్సయ్య, షబానా మహమ్మద్, ఊరడి లత, ముల్కల కవిత, జ్యోతి రెడ్డి, జీడి రమేష్, దన్న సింగ్, మాసుం ఖాన్, తదితరులుపాల్గొన్నారు.