calender_icon.png 1 March, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండి సంజయ్ ను బర్తరఫ్ చేయాలి

28-01-2025 05:59:43 PM

గద్దర్ పై అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం..

అంబేద్కర్, ఐక్య ప్రజా సంఘాల నాయకుల డిమాండ్...

లక్షేట్టిపేట (విజయక్రాంతి): కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని అంబేద్కర్, ఐక్య ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరం వద్ద దివంగత గద్దర్ పై సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు. ఇటీవల పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డ్స్ కేటాయింపులో గద్దర్ కు జరిగిన అవమానం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు ముల్కల రాందాస్ మాట్లాడుతూ... గద్దర్ గురించి హద్దులు దాటి మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. గద్దర్ ను విమర్శించే స్థాయి సంజయ్ కి లేదన్నారు. ప్రజా ఉద్యమాల నేత అయినటువంటి గద్దర్ ప్రజల గుండెల్లో ఎల్లప్పుడూ బ్రతికే ఉంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డ్స్ కోసం గద్దర్ పేరును ప్రతిపాదిస్తే బీజేపీకి ఎందుకు నచ్చడం లేదో అర్ధం కావడం లేదన్నారు. ముఖ్యంగా దళిత, బహుజన వర్గాలను కించపరిచే వ్యక్తులకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

అనంతరం అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు చాతరాజు రాజన్న మాట్లాడుతూ... ఒకప్పుడు బీజేపీ నాయకులే గద్దర్ సేవలను కొనియాడి నేడు అవమానించడం వారి అజ్ఞానాన్ని సూచిస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో బీజేపీ నాయకులు ప్రజా గాయకుని గురించి అవమానకరంగా మాట్లాడితే సహించేదిలేదన్నారు. పోలీస్ లను, బీజేపీ కార్యకర్తలను చంపినట్లు ఆరోపించడం తగదన్నారు. తెలంగాణ ఉద్యమంతో పాటు ఎన్నో ఉద్యమాల కోసం జీవితాన్ని త్యాగం చేసి, ప్రజల కోసం గద్దర్ జీవించినట్లు వివరించారు. గద్దర్ పట్ల తప్పుడు మాటలు మాట్లాడవద్దని సంజయ్ కి హితవు పలికారు. అనంతరం ప్రజా సంఘాల ప్రతినిధి కళ్యాణం రవి మాట్లాడుతూ... ప్రజా నౌకగా ప్రసిద్ధి చెంది, సామాజిక మహనీయునిగా వెలుగొందిన గద్దర్ పై లేనిపోని ఆరోపణలు చేయడం బండి సంజయ్ పదవికి అనర్హతగా భావిస్తున్నామన్నారు.

బూట్లు మోసి పదవి తెచ్చుకున్న బండి సంజయ్ కి ప్రజల కోసం జీవించినటువంటి గద్దర్ విలువ తెలియదన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో పని చేస్తున్న బీజేపీకి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దళిత, బహుజన సమాజంపై బండి సంజయ్ వ్యాఖ్యల్ని దాడిగా భావిస్తున్నామన్నారు. వెంటనే సంజయ్ మాటలను వెనక్కి తీసుకుని గద్దర్ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి భైరం రవి, జిల్లా నాయకులు శనిగారపు లింగన్న, చిప్పకుర్తి నారాయణ, ఐక్య ప్రజా సంఘాల ప్రతినిధి హనుమండ్ల శంకర్, మాజీ మండలాధ్యక్షుడు నర్సయ్య, నాయకులు పెండెం సత్తన్న,ప్రేమ్ సాగర్, చుంచు రమేష్, తొగరు ప్రభాకర్, గుత్తికొండ శ్రీధర్, దుర్గయ్య, చిన్నయ్య, వెంకటేష్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.