కరీంనగర్,(విజయక్రాంతి): ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బరితెగించి పాలన చేస్తోంది. అస్తవ్యస్త పాలనను కొనసాగిస్తోంది. శాంతిభద్రతలు అదుపులో లేకుండా పోతున్నాయి. ఆలయాలను ధ్వంసం చేస్తున్నా.. హిందూ ధర్మంపై దాడులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది.’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఒక సమస్య వస్తే దానిని పరిష్కరించకుండా మరో సమస్యను సృష్టించి డ్రామాలాడుతోందన్నారు. హైడ్రా, మూసీ పునరుజ్జీవం, కుల గణన పేరుతో మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఆరు గ్యారంటీలను దాటవేస్తోందని మండిపడ్డారు. సీఎం హామీ ఇస్తే వెంటనే అమలు చేయాల్సింది పోయి... అందుకు భిన్నంగా సీఎం ఇస్తున్న హామీలకు, చెబుతున్న మాటలకు విలువ లేకుండా పోయిందని విమర్శించారు.
కేసీఆర్ కుటుంబ, నియంత, అవినీతి పాలనతో విసిగిపోయి మార్పు కోసం కాంగ్రెస్ కు ఓటేసిన ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లయిందన్నారు. రాష్ట్రంలో అతి తక్కువ వ్యవధిలో అత్యంత తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్సేనన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, ఆ పార్టీకి క్యాడర్ లేకుండా పోయిందన్నారు. లీడర్లున్నా... వాళ్లంతా గోడమీది పిల్లిలా ఇతర పార్టీలవైపు చూస్తున్నారని పేర్కొన్నారు. 2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు తథ్యమని ఉద్ఘాటించారు. ఈరోజు ఉదయం బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని తన కార్యాలయంలో ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’’ అసోసియేషన్ కు చెందిన వందలాది మంది ఎన్నారైలతో ‘జూమ్’ ద్వారా సంభాషించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, అసోసియేషన్ ప్రతినిధులు పవన్, క్రిష్ణారెడ్డి, విలాస్ జంబుల, నిర్మలారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.