calender_icon.png 19 October, 2024 | 6:02 PM

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అరెస్ట్

19-10-2024 03:23:50 PM

హైదరాబాద్: అశోక్ నగర్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్ చలో సచివాలయానికి  పిలుపునిచ్చారు. బండి సంజయ్, గ్రూప్-1 అభ్యర్థులు సచివాలయం వైపు బయల్దేరారు. గ్రూప్ వన్ పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. చలో సచివాలయానికి వెళ్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. బండి సంజయ్ ముందుకు వెళ్లకుండా పోలీసులు నిలువరిస్తున్నారు. పోలీసులు తీరుపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం ను కలిసి వాస్తవాలు వివరించేందుకే వెళ్తున్నానని బండి సంజయ్ పోలీసులకు చెప్పారు.

సచివాలయానికి వెళ్లి తీరుతామని బండి సంజయ్ తేల్చిచెప్పారు. రోడ్డుపై భైఠాయించి అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. బండి సంజయ్ ను తీసుకెళ్తున్న వాహనాన్ని అభ్యర్థులు అడ్డుకున్నారు. జీవో 29ని రద్దు చేయాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన కోరారు. వారం రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, ఆందోళనలో ఉన్న విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళల్ని, గర్భిణీలను కొడుతున్నారు.. దాష్టీకానికి నిదర్శనం అన్నారు. జీవో 29పై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పులకు.. అభ్యర్థుల ఆందోళనకు సంబంధం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.