రికార్డు ధర పలికిన ‘కమెడియన్’ బనానా
న్యూఢిల్లీ, నవంబర్ 21: ‘బనానా టేప్’ మరోసారి వార్తల్లో నిలిచింది. వేలంలో ఏకంగా రూ.52కోట్లు పలికి ఔరా అనిపించింది. ప్రముఖ ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలాన్ సృష్టించిన ఈ బనానా టేప్‌ను సోథ్‌మే సంస్థ వేలంలో ఉంచింది.
న్యూయార్క్‌లో నిర్వహించిన ఈ వేలంలో క్రిప్టోకరెన్సీ వ్యవస్థాపకుడు జస్టిస్ సన్ దానిని అందరికంటే ఎక్కువ ధరను వెచ్చించి దక్కించుకున్నారు. ఓ ప్రముఖ కమెడియన్ పేరిట చేసిన ఈ అరటిపండు ఆర్ట్‌వర్క్‌ను 2019లో తొలిసారి మియామీ బీచ్ ఆర్ట్ బాసెల్‌లో ప్రదర్శించారు.
మూడురోజులకోసారి బనానా ఛేంజ్..
ఆర్ట్‌వర్క్‌లో భాగంగా ప్రతి మూడురోజుల కోసారి ఇక్కడి అరటిపండును మారుస్తుంటారు. అప్పటి నుంచి బనానా టేప్‌ను కళాఖండంగా భావించాలా? వద్దా ? అనే దాని గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో 2019లో తొలిసారిగా ఈ ఆర్ట్‌ను వేలం వేయగా రూ.98లక్షలకు అమ్ముడుపోయింది. ఆ తర్వాత దీని రూరకర్జ్ కాటెలాన్ ఈ ఆర్ట్‌వర్క్ ధరను క్రమంగా పెంచుకుంటూ వస్తున్నారు.
అప్పటి నుంచి ఈ ఆర్ట్‌వర్క్ ధర పెరుగుతూ వస్తోంది. దీని సృష్టికర్త కాటెలాన్ మాట్లాడుతూ.. ‘బనానా టేప్ కేవలం ఒక ఆర్ట్ మాత్రమే కాదు.. ఇది ఆర్ట్, మీమ్స్, క్రిప్టో కరెన్సీ కలగలిసిన ప్రపంచాలను ప్రతిబింబించడంతో పాటు భవిష్యత్‌లో మరిన్ని ఆలోచనలను ప్రేరేపిస్తుంది’ అని తెలిపారు.
వెయ్యి కోట్లు పలికిన పెయింటింగ్
అలాగే న్యూయార్క్‌లోని క్రిస్టీన్ ఆక్షన్‌లో ఓ పెయింటింగ్ రికార్డు స్థాయి ధర పలికింది. ప్రముఖ కళాకారుడు రెనే మాగ్రిట్టే వేసిన పెయింటింగ్‌కు 121 మిలయన్ డాలర్లు (సుమారు రూ.1021 కోట్లు) పలికింది. ‘ది ఎంపైర్ ఆఫ్ లైట్’ పేరుతో ప్రదర్శనకు వచ్చిన ఈ పెయింటింగ్.. ‘రాత్రి, పగలు ఒకేసారి కనిపించేలా’ గీశారు. కాగా గతంలోనూ రెనే వేసిన ఓ పెయింటింగ్ దాదాపు 79 మిలియన్ డాలర్లు పలకడం గమనార్హం.