- ఆరోగ్యానికి అది ప్రమాదకరం
- ఫుడ్, డ్రగ్స్ విభాగాల ఫిర్యాదు
- నిషేధిస్తూ ప్రభుత్వం ప్రకటన
- ఒకే గొడుగు కిందికి ఫుడ్ సేఫ్టీ
- 5 ఫుడ్ సేఫ్టీ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు
- అందుబాటులోకి మూడు మొబైల్ ల్యాబ్స్
- ఏటా 24 వేల నమూనాలు తనిఖీ
- వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ
హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనైజ్‌ను నిషేధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉడకబెట్టని కోడిగుడ్లతో తయారు చేస్తున్న మయోనైజ్‌ను ఏడాది పాటు నిషేధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో ఫుడ్ సేఫ్టీపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం అధికారులు ఈ నిర్ణయం తీసుకుంటూ ఆదేశాలిచ్చారు. సమీక్షలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీల పనితీరుపై మంత్రి ఆరా తీశారు.
235 హోటళ్లు, హాస్టళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, గోడౌన్స్‌లో తనిఖీలు చేశామని, 170 సంస్థలకు నోటీసులు ఇచ్చామని జీహెచ్‌ఎంసీ టాస్క్‌ఫోర్స్ అధికారులు మంత్రికి వివరించారు. జిల్లాల్లోనూ విరివిగా తనిఖీలు చేయాల ని మంత్రి సూచించారు. ఇందుకోసం రెండు టాస్క్‌ఫోర్స్ కమిటీలను నియమించాలని ఆదేశించారు.
హైదరాబాద్‌లోని నందినగర్‌లో మోమోస్ తిని ఒకరు మరణించగా, పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి ఆరా తీశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిపి తినే మయోనైజ్‌ను అనారోగ్యకరమైన ఎగ్స్‌తో తయారు చేస్తున్నారని, దానివల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని మంత్రికి అధికారులు తెలిపారు. మయోనైజ్ తిన్న తర్వాత కలిగిన దుష్పరిణామాలపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు.
కేరళలో ఈ తరహా మయోనైజ్ తయారీని ప్రభుత్వం నిషేధించిందని, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మన రాష్ర్టంలో నిషేధం విధించాలని కోరారు. ఈ అంశంపై పలువురు డాక్టర్లు, ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి.. మయోనైజ్‌పై నిషేధం విధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్‌కు సూచించారు. మంత్రి ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. 2025 అక్టోబర్ చివరి వరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
భారీగా పెరిగిన ఫుడ్ ఇండస్ట్రీ
రాష్ర్టంలో గత పదేండ్లలో హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, హాస్టళ్ల సంఖ్య భారీగా పెరిగిందని, ఇందుకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ బలోపేతం కాలేదని, కొత్త పోస్టులు మంజూరు కాలేదని అధికారులు మంత్రికి వివరించారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలతో ముడిపడి ఉన్న డ్రగ్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ విషయంలో రాజీ పడేది లేదని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు.
ఫుడ్ సేఫ్టీలో ముందున్న రాష్ట్రాలు, దేశాల్లో అవలంభిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. అవసరమైన కొత్త పోస్టుల ను మంజూరు చేసి, భర్తీ చేస్తామన్నారు.
కొత్తగా మూడు ఫుడ్ టెస్టింగ్ మొబైల్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి తెలిపారు. 5 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ అందుబాటు లోకి తీసుకొస్తున్నామన్నారు. సంవత్సరానికి సుమారు 24 వేల శాంపిల్స్ టెస్ట్ చేసేలా ల్యాబ్స్‌ను బలోపేతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని మంత్రి సూచించారు.
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లలో డ్రగ్ అథారిటీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆఫీసులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఫుడ్, డ్రగ్స్‌కు సంబం ధించిన ఫిర్యాదులు ఎవరికి, ఎక్కడ చేయాలో ప్రజలకు తెలిసేలా అవగాహన కల్పించాలని తెలిపారు.
ఆహారం కల్తీ చేయాలంటే భయపడేలా కల్తీగాళ్లపై చర్యలు ఉండాలని అధికారు లను మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్, డైరెక్టర్ శివలీల, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్లు మూర్తి రాజు, అమృత, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.