- పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
- దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపణ
ఇస్లామాబాద్, జూలై 15: పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. ఇమ్రాన్ పార్టీ పీటీఐని నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ దేశ సమాచార, ప్రసార మంత్రి అత్తావుల్లా తరార్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. పీటీఐ పార్టీ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందనే ఆరోపణల నేపథ్యంతో ఆ పార్టీపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పీటీఐ పార్టీపై విదేశీ నిధుల కేసు, మే 9 దేశంలో జరిగిన అల్లర్ల కేసు, సైఫర్ ఎపిసోడ్ సహా పలు కేసుల్లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తాము విశ్వసిస్తున్నట్లు మం త్రి తెలిపారు. రిజర్వ్‌డ్ సీట్ల విషయంలో పీటీఐకి, అక్రమ వివాహం కేసులో ఇమ్రాన్ ఖాన్‌కి జూలై 12న సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. సుప్రీం తీర్పు వెలువడిన రెండు రోజులకే పాకిస్థాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. మహిళలు, మైనార్టీలకు రిజర్వు చేసిన సీట్లను కేటాయించేందుకు ఆ పార్టీకి అర్హత ఉందని ఆ దేశ సుప్రీంకోర్టు జూలై 12న కీలక తీర్పు వెలువరించింది.
సుప్రీం తీర్పుతో జాతీయ అసెంబ్లీలో 23 రిజర్వ్‌డ్ స్థానాలను పీటీఐ దక్కించుకుంది. తద్వారా పార్టీ సీట్లు 86 నుంచి 109కి పెరిగాయి. దీంతో పీటీఐ పాకిస్థాన్‌లో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించింది.