* నాపై నాడా నిషేధం విధించడం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఏడాది కాలంగా ఈ సమస్య కొనసాగుతూ వస్తోంది. నాడాకు శాంపిల్ ఇచ్చేది లేదన్న మాటకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నా. మా ఇంటికి వచ్చి డోపింగ్ టెస్టు నిర్వహించినప్పుడు పాడైపోయిన కిట్‌ను ఉపయోగించారు. కాంగ్రెస్‌కు బదులు బీజేపీలో జాయిన్ అయ్యి ఉంటే నాపై నిషేధం ఉండేది కాదేమో. ఇది ఊహించిందే.
బజరంగ్ పూనియా
- నాలుగేళ్ల పాటు నిషేధం
- రెజ్లింగ్ కెరీర్ ముగిసినట్లే!
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాపై నిషేధం పడింది. డోపింగ్ టెస్టుకు శాంపిల్ ఇచ్చేందుకు నిరాకరించిన కారణంగా నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) బజరంగ్‌ను రెజ్లింగ్ ఆడకుండా నాలుగేళ్ల పాటు నిషేధించింది. విషయంలోకి వెళితే జాతీయ జట్టు ఎంపిక కోసం ఈ ఏడాది మార్చిలో సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా బజరంగ్‌ను డోపింగ్ టెస్టుకు హాజరవ్వాలని కోరింది. కిట్‌లో నాణ్యత లేదని.. పాడైపోయిన వాటితో డోపింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారంటూ శాంపిల్ ఇచ్చేందుకు బజరంగ్ నిరాకరించాడు. బజరంగ్ ఆరోపణలను తోసిపుచ్చిన నాడా ఏప్రిల్ 23న అతడిపై సస్పెన్షన్ విధించింది. ఆ తర్వాత ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) కూడా బజరంగ్‌పై వేటు వేసింది.
దీంతో బజరంగ్ తన సస్పెన్షన్‌పై నాడా యాంటీ డిసిప్లీనరీ డోపింగ్ ప్యానెల్ (ఏడీడీపీ)కి ఫిర్యాదు చేశాడు. జూన్ 23న తొలిసారి నాడా బజరంగ్‌కు నోటీసులు జారీ చేసింది. హర్యానా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన బజరంగ్ తనకు జారీ అయిన నోటీసులపై జూలై 11న ఏడీడీపీకి లేఖ రాశాడు. సెప్టెంబర్ 20, అక్టోబర్ 4న వాదనలు విన్న ఏడీడీపీ నాడాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
‘ఆర్టికల్ 10.3.1 నిబంధనను ఉల్లఘించడంతో బజరంగ్‌ను బాధ్యుడిని చేస్తూ అతడిపై నాలుగేళ్లు నిషేధం విధించాం’ అని ఏడీడీపీ తెలిపింది. ఈ నిషేధం బజరంగ్ కెరీర్‌కు ముగింపు పలకడమే కాకుండా భవిష్యత్తులో కోచ్‌గా పనిచేసే అవకాశాన్ని కూడా కోల్పోయాడు.
ఇక 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల 65 కేజీల విభాగంలో పూనియా కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. 2018, 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాలతో సత్తా చాటాడు. ఇక తన సస్పెన్షన్‌పై బజరంగ్ స్పందించాడు.