calender_icon.png 18 October, 2024 | 1:30 PM

కేసీఆర్‌ను బద్నాం చేయడానికి కాంగ్రెస్ విషప్రచారమే కాళేశ్వరం బ్యాక్ వాటర్

27-07-2024 12:05:07 PM

హైదరాబాద్: కాళేశ్వరం బ్యాక్ వాటర్ తోనే పంట పొలాల ముంపునకు గురవుతున్నాయి అన్నది అవాస్తవమని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. గతంలో 1983, 1986, 1996,  2003, 2016 సంవత్సరాల్లో ప్రాణహిత గోదావరి నదుల్లో వరద వచ్చి పంట నష్టం జరిగిందన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, అప్పటి కేసీఆర్ సర్కార్ ని బద్నాం చేయడానికి కాంగ్రెస్ నాయకులు చేసిన విషప్రచారమే కాళేశ్వరం బ్యాక్ వాటర్ అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో సగానికి పైగా డ్యామ్ లు ఎండిపోయి సాగునీరు లేక రైతాంగం ఇబ్బంది పడుతుందని బాల్కసుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది క్యూసెక్కుల నీరు వృధాగా పోతున్నా తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని ఎత్తిపోయకుండా కాంగ్రెస్ సర్కార్ డ్రామాలాడుతుందని మండిపడ్డారు.

ఈ విషయాలన్నీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల బృందం వాస్తవాలతో ప్రజలకు తెలియజేసే క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించి వాస్తవాలు ప్రజలకు తెలియజేశారని వెల్లడించారు.కాంగ్రెస్ నాయకుల అవివేకం, అజ్ఞానంతో పంట పొలాలకు సాగు నీళ్లు ఇవ్వడం చాతకాకనే ముంపు గ్రామాలు, పంట పొలాలు అంటూ ఎప్పటి లాగానే డైవర్ట్ డ్రామాలాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలన్న వివేక్..! మొన్న ఎన్నికల సందర్భంలో చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు తమరు ఇచ్చిన 30 హామీలతో కూడిన మేనిఫెస్టోలో గోదావరి వరదలు రాకుండా కరకట్టలు కడతానని ప్రజలకు మాట ఇచ్చి మభ్యపెట్టింది మర్చిపోయావా? అని ప్రశ్నించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇంకా తమరి మొద్దు నిద్ర వీడడం లేదా? మొన్న కోటపల్లిలోని కొన్ని గ్రామాల్లో పర్యటించినప్పుడు కనీసం భూమిపై నడవడానికి కూడా ఇష్టపడక గ్రామస్తులతో చివాట్లు తిన్న నువ్వా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడేదని బాల్క సుమన్ అన్నారు.