calender_icon.png 23 November, 2024 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్ రూపకల్పనలో బల్దియా అలసత్వం!

13-11-2024 12:13:46 AM

  1. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు 
  2. గడువు ముగుస్తున్నా సిద్ధంకాని ప్రతిపాదనలు
  3. జార్ఖండ్ ఎన్నికల విధుల్లో కమిషనర్ 
  4. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో బల్దియా

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 12 (విజయక్రాంతి): బల్దియా బడ్జెట్‌ను ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ప్రణాళికాబద్ధంగా నిర్వహించడంపై అనేక సందేహాలు నెలకొన్నాయి.  ఏటా ఫిబ్రవరి 20న జీహెచ్‌ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం, ఆమోదించే ప్రక్రి య కొనసా గుతుంది. అయితే, ఈ ఏడాది పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు ఈ నెల 20న జరగనున్న ఝార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి వెళ్లగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. 2025 ఏడాదికి సంబంధించి బల్దియా ప్రతిపాదిత బడ్జెట్ రూపకల్పన ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నా ముందడుగు పడలేదు. 

రూపకల్పన ప్రక్రియ ఇలా.. 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఏటా గ్రేటర్ ప్రజల అభివృద్ధి, వివిధ సంక్షేమ కార్యక్రమాలు, బల్దియా నిర్వాహణ తదితర కేటాయింపులపై బడ్జెట్ రూపొందిస్తుంది. జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం బడ్జెట్ రూపకల్పనకు ప్రతి ఏడాది టైమ్ టేబుల్ ప్రకారం బడ్జెట్ రూపొందిస్తారు. ఈ మేరకు అక్టోబరు 1 నాటికి ప్రతిపాదిత బడ్జెట్ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది. అక్టోబర్ 10 నాటికి ఆయా విభాగాల హెచ్‌ఓడీలు ప్రతిపాదనలు రూపొందించి కమిషనర్‌కు పంపాలి.

కమిషనర్ పరిశీలన అనంతరం అక్టోబర్ 25 లోపు ఫైనల్ చేయడం, నవంబర్ 10 లోపు ప్రతిపాదిత బడ్జెట్ స్టాండింగ్ కమిటీ ముందుకు వస్తుంది. ఈ సమావేశంలో సభ్యుల అధ్యయనం తర్వాత మార్పులు చేర్పులు చేసి డిసెంబర్ 10 నాటికి బడ్జెట్ బుక్‌లను కార్పొరేటర్లకు అందించాలి. ఈ బడ్జెట్‌ను అధ్యయనం చేయడానికి కార్పొరేటర్లకు నెల రోజుల గడువు ఉంటుంది. ఆ తర్వాత డిసెంబర్ 15 నాటికి జనరల్ బాడీ సమావేశంలో ఆమోదం పొంది, అక్కడ వచ్చే కొత్త ప్రతిపాదనలు, మార్పులు, అదనపు కేటాయిం పులతో ఫిబ్రవరి 20 నాటికి తుది బడ్జెట్ రూపొందుతుంది. 

సీఈసీ అనుమతితో నగరానికి..

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జ్ కమిషనర్ ఇలంబర్తి ఝార్ఖండ్ ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ ఆలస్యం కావడంతో ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) అనుమతితో కమిషనర్ ఇలంబర్తి నగరానికి రానున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో రెండ్రోజుల పాటు ఇక్కడే ఉండి బడ్జెట్‌కు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు సూచించే అవకాశాలున్నాయి. జోన్ల నుంచి సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన పలువురు ఇంజినీరింగ్ అధికారులకు మెమోలు అందినట్లు తెలుస్తోంది. కమిషనర్ నగరానికి రాగానే సంబంధిత ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు.