- బడ్జెట్ ప్రవేశపెట్టిన నగర మేయర్ విజయలక్ష్మి
- ప్రజాసమస్యలను చర్చించాలని బీఆర్‌ఎస్ సభ్యుల డిమాండ్
- పోడియం వద్దకు దూసుకెళ్లగా అడ్డుకున్న కాంగ్రెస్ సభ్యులు
- రెండువర్గాల మధ్య ఘర్షణ
- చివరకు చర్చ లేకుండానే రూ.8,440 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 30 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ) ప్రధాన కార్యాలయంలో 2025 26 వార్షిక బడ్జెట్‌పై గురువా రం జరిగిన బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. సమావేశ ఆరంభంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రకటించగా, అందుకు బీఆర్‌ఎస్, బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు.
బడ్జెట్ కంటే ప్రజాసమస్యలపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్‌ను తోసిపుచ్చుతూ మేయర్ రూ.8,440 కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీంతో బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది.
ఒక దశలో మేయర్ ఆదేశాలతో బీఆర్‌ఎస్ కార్పొరేటర్లను మార్షల్స్ బయటకు లాక్కె ళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ పరిణామం తర్వాత ఎలాంటి చర్చ లేకుండానే రూ.8, కోట్ల బడ్జెట్ ఆమోదం పొందింది. మరోవైపు మార్షల్స్‌ను వినియోగించి సభ్యులను లాక్కెళ్లడం బల్దియా చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం.
నలుగురు బీఆర్‌ఎస్ సభ్యులను లాక్కెళ్లిన మార్షల్స్..
తొలుత సమావేశం ప్రారంభమైన తర్వాత తొలుత సభ్యులు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించారు. తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్టు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటించారు. అందుకు బీఆర్‌ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ పోడియం వైపు దూసుకెళ్తుండగా, కాంగ్రెస్ సభ్యులు అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్ సభ్యుల చేతిలోని ఫ్లకార్డులు లాక్కొని చించేశారు.
అది కాస్త ఉద్రిక్తతకు దారి తీయగా, ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో మేయర్ మార్షల్స్‌ను రప్పించారు. మార్షల్స్ బీఆర్‌ఎస్ సభ్యులు సింధూ, విజయశాంతి, పద్మ, విజయ్‌ని బయటకు లాక్కెల్లారు. అనంతరం పోలీసులు ఆ నలుగురు సభ్యులను పోలీస్ వాహనంలో ఎక్కించి, 20 నిమిషాల పాటు ట్యాంక్‌బండ్ చుట్టూ తిప్పారు. అనంతరం వారిని తిరిగి జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చారు.
చర్చ లేకుండానే బడ్జెట్ ఆమోదం..
వాయిదా అనంతరం 11 గంటలకు కౌన్సిల్ ప్రారంభం కాగానే బడ్జెట్ అప్రూవ్‌డ్ అంటూ నగర మేయర్ ప్రకటించి సభను మరోసారి వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన కౌన్సిల్‌లో బయటకు తీసుకెళ్లిన కార్పొరేటర్లను లోపలికి పిలిపించాలని బీఆర్‌ఎస్ సభ్యులు పట్టుబట్టారు. వారిని పిలిచినా లోపలికి రావడం లేదంటూ మేయర్ సభ్యులకు సమాధానమిచ్చారు.
‘మీరెళ్లి తీసుకుని రండి..’ అంటూ బీఆర్‌ఎస్ సభ్యులకే మేయర్ సూచించారు. ఇలా సమావేశం దాదాపు గంటకు పైగా రసాభసాగా మారింది. ఇలా సమావేశం గంటన్నరలో ఆరుసార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ సభ్యులు ‘కేసీఆర్ 420.. కేటీఆర్ 420’ అంటూ పేపర్లపై రాసి సమావేశంలో ప్రదర్శించారు.
మేయర్ వారిని సముదాయించే ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. తర్వాత ఆమె బడ్జెట్‌ను అమోదిస్తున్నట్లు ప్రకటించారు.
సీఎం దావోస్ పర్యటనపై తీర్మానం..
మధ్యాహ్నం లంచ్ విరామం తర్వాత, మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు నగర మేయర్ విజయలక్ష్మితో పాటు బల్దియా అధికారులు సమాధానమిచ్చారు. ‘మా డివిజన్‌లో 72 కాలనీలు ఉండగా, కేవలం 30 లైట్లు మాత్రమే అందజేశారు’ అంటూ చర్లపల్లి కార్పొ రేటర్ బొంతు శ్రీదేవి అధికారులను నిలదీశారు.
బీజేపీ సభ్యురాలు ఆకుల శ్రీవాణి మాట్లాడుతూ.. తమ డివిజన్‌లో కనీసం స్వీపింగ్ మెషిన్లు అందుబాటులో లేవని వాపోయారు. బల్దియా రూ.6 వేల కోట్ల అప్పుల్లో ఉండగా, ఎస్‌ఎన్‌డీపీ, ఎస్‌ఆర్డీపీ పాత స్కీంలకే హెచ్‌సిటీగా పేరు మార్చారని విమర్శించారు. తర్వాత కాంగ్రెస్ సభ్యుడు రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ పరిధిలో పదేళ్లుగా రాని నిధులు కాంగ్రెస్ హయాంలో ఎక్కువగా విడుదలయ్యాయన్నారు.
బీజేపీ సభ్యుడు కొప్పుల నరసింహారెడ్డి మాట్లాడుతూ.. బల్దియా పరిధిలో ప్రకటనల సంస్థలైన ప్రకాశ్ యాడ్స్, లీడ్స్ స్పేస్ సంస్థలు జీహెచ్‌ఎంసీ అల్లుళ్లలా మారిపోయాయని విమర్శించారు. అనంతరం మేయర్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి బృందం దావోస్ పర్యటన, రాష్ట్రానికి రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తూ తీర్మానం చేశారు.
అనంతరం ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందిన 13 అంశాలను కౌన్సిల్ ఆమోదిస్తున్నట్లుగా వెల్లడించారు. అనంతరం కౌన్సిల్ సమావేశం ముగిసినట్లు ప్రకటించారు.