calender_icon.png 23 October, 2024 | 7:02 PM

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బలవన్మరణం

07-07-2024 12:00:00 AM

ఆర్థిక ఇబ్బందులే కారణం? 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి): టాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ (33) ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులకు తోడు ఆరు నెలలుగా సినిమాలు లేకపోవడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఏపీలోని రాజమండ్రికి చెందిన స్వప్న వర్మ మూడేళ్ల క్రితం నగరానికి వ్చింది. మాదాపూర్ కావూరి హిల్స్‌లోని తీగల హౌజ్ అపార్ట్‌మెంట్‌లోని 101 ఫ్లాట్‌లో ఒంటరిగా నివాసం ఉంటోంది. అయితే, గత ఆరు నెలలుగా సినీ పరిశ్రమలో ఎలాంటి ప్రాజెక్టులు లేక ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి.

ఈ క్రమంలోనే మానసికంగా ఒత్తిడికి గురైన ఆమె తన ఫ్లాట్‌లో రెండు రోజుల క్రితం ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఫ్లాట్ డోర్ వేసి ఉండడంతో ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. శనివారం ఉదయం ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా స్వప్న వర్మ ఉరివేసుకొని కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కుటుంబీకులకు సమాచారమిచ్చారు.