29-04-2025 01:32:49 PM
ప్రముఖ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును(Padma Bhushan Award) అందుకున్నారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పరుస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పౌర సన్మాన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) ఈ అవార్డులను ప్రదానం చేశారు. బాలకృష్ణ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. సాంప్రదాయకంగా ధోతీ ధరించి, నందమూరి బాలకృష్ణ పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం తర్వాత మీడియాతో ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ అవార్డు అందుకోవడం పట్ల నందమూరి బాలకృష్ణ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన తన అభిమానులకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చాలా కాలం క్రితమే కొంతమంది అభిమానులు తాను ఈ అవార్డుకు అర్హుడని తరచుగా అభిప్రాయపడినప్పటికీ, తనకు సరైన సమయంలో పద్మభూషణ్ వచ్చిందని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. తాను నటించిన నాలుగు సినిమాలు వరుసగా విజయం సాధించడం, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తయింది. ముఖ్యంగా బాలయ్య చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి యాభై సంవత్సరాలు పూర్తి కావడం, ఈ సమయంలో పద్మభూషన్ అవార్డును అందుకోవడం ఈ ఏడాది నాకు ఎంతో ప్రత్యేకం అని బాలకృష్ణ వివరించారు.