ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆయన ఈ ఏడాదితో నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించేందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న జరగనున్న ఈ వేడుకకు సంబంధించి ప్రచార పోస్టర్‌ను బుధవారం టీఎఫ్‌సీసీ బాధ్యులు విడుదల చేశారు. ఎఫ్‌ఎన్‌సీసీలో జరిగిన కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ, మోహనకృష్ణ పాల్గొని బాలకృష్ణ స్వర్ణోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోహనకృష్ణ మాట్లాడుతూ.. ‘మా తమ్ముడు బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం.
ఎలాంటి పాత్రనైనా చేయగల నటుడిగా నిరూపించుకున్నారు. మానాన్న గారికి వారసుడిగా బాలకృష్ణ ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో, అటు రాజకీయాల్లో నిలబడ్డారు. ఇటీవలి ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించి, హిందూపురం అడ్డా నందమూరి గడ్డ అని నిరూపించారు’ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, వైవీఎస్ చౌదరి, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, కైకాల నాగేశ్వరరావు, సీ కల్యాణ్, డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, బోయపాటి శ్రీనివాస్, నటుడు మాదాల రవి, మా అసోసియేషన్ ట్రెజరర్ శివబాలాజీ, దామోదర్ ప్రసాద్, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, తుమ్మల ప్రసన్నకుమార్, రచయిత పరుచూరి గోపాలకష్ణ, ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ మాట్లాడి బాలకృష్ణతో అనుబంధాన్ని వివరించారు.