calender_icon.png 23 December, 2024 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా బాలగోపాల్ సంస్మరణ సభ

07-10-2024 02:34:49 AM

పాల్గొన్న ప్రముఖ వక్తలు 

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కొనసాగిస్తున్న ఎన్‌కౌంటర్‌లను ఆపేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (విజయక్రాంతి): మానవ హక్కుల వకీలుగా కీర్తి పొందిన కే బాలగోపాల్ 15వ సంస్మరణ సభను ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల వేదిక.. అక్టోబర్ 4న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను ఖండిస్తూ, ఆపరేషన్ కగార్ పేరు మీద కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కొనసాగిస్తున్న ఎన్‌కౌంటర్‌లను తక్షణమే ఆపి వేయాలని ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ కార్యక్రమంలో పౌరసత్వ చట్ట సవరణలకు వ్యతిరేకంగా ఉద్యమించినందుకు నాలుగు సంవత్సరాలుగా కారాగారంలో ఉన్న ఉమర్ ఖలీద్, ఇతర కార్యకర్తల గురించి సినీ దర్శకుడు లలిత్ వచాని రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శించారు. అలాగే మానవ హక్కుల వేదిక ప్రచురించిన ‘బీల కోసం.. బతుకు కోసం : సోంపేట హరిత ఉద్యమ చరిత్ర’, ‘రిజర్వేషన్ల వర్గీకరణ ప్రజాస్వామిక దృక్పథం’ పుస్తకాలను వక్తలు, మానవ హక్కుల వేదిక నాయకులు, సోంపేట ఉద్యమకారులు ఆవిష్కరించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చిన సైనిక క్యాంపులు, వాటి కారణంగా స్థానిక ఆదివాసీలు పడుతున్న ఇబ్బందులు, వేధింపుల గురించి దేశవ్యాప్త మానహక్కుల కార్యకర్తలు నిర్వహించిన విస్తృత నిజ నిర్ధారణ నివేదికను ఆవిష్కరించారు.

పాలస్తీనాపై ఇజ్రాయెల్ సాగిస్తున్నది నీతి లేని యుద్ధం : అచిన్ వనాయక్

ఈ సందర్భంగా రచయిత అచిన్ వనాయక్ మాట్లాడుతూ.. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ సాగిస్తున్నది నీతి లేని యుద్ధమని, ఇజ్రాయెల్ తీరు మధ్య ప్రాచ్య ప్రాంతాన్ని యుద్ధం అంచులకు తీసుకొస్తుందని విమర్శించారు. వలస పాలనలో పాలస్తీనాను విభజించి, నేడు పాలస్తీనా దేశ అస్తిత్వాన్నే ప్రమాదంలో పడేశారని తెలిపారు.

భారతదేశం చారిత్రకంగా పాలస్తీనా కు మద్దతు తెలుపుతూ వస్తుందని, అయితే నేటి బీజేపీ పాలనలో ఆ న్యాయమైన విధానాన్ని వదిలేసి ఇజ్రాయెల్‌కు మద్దతు తెలపడం అన్యాయమన్నారు. భారతదేశం నుంచి ఇజ్రాయెల్‌కు ఆయుధాల ఎగుమతిని తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేశారు. 

క్వీర్ హక్కుల ప్రతినిధి తాషీ చోడుప్ మాట్లాడుతూ.. ప్రజా, సామాజిక, రాజకీయ ఉద్యమాలలో ట్రాన్స్‌జెండర్, క్వీర్, భిన్న లైంగిక సమూహాల హక్కులని భాగం చేయడం నేడు తప్పనిసరని వివరించారు. అత్యంత అణగారిన వర్గాలైన ఈ సమూహాల హక్కులను నేటికీ గుర్తించడం లేదని, దీనిని మార్చడానికి ప్రజా ఉద్యమాలు రావాలని అన్నారు.

మానవ హక్కుల ఉద్యమంలో, కార్యక్రమాలలో ఈ సమూహాల హక్కులకి సమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ జీవన్‌కుమార్, డాక్టర్ ఎస్ తిరుపతయ్య, మేమన వసంత లక్ష్మి, వై రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.