calender_icon.png 8 November, 2024 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంధుడి అద్భుత గాత్రం బలగం రవి బతుకు 'వి'చిత్రం

19-07-2024 03:03:12 PM

కళ్ళు లేవని కలత చెందట్లేదు.. కన్నీళ్లు కార్చట్లేదు.. అద్భుత గాత్రంతో.. అందరినీ ఆకట్టుకుంటున్న అంధుడు "బలగం" రవి బతుకు "వి"చిత్రం ఇది.

జగిత్యాల,(విజయక్రాంతి): కళ్ళు లేవని కలత చెందట్లేదు.. కన్నీళ్లు కార్చట్లేదు.. అద్భుత గాత్రంతో.. అందరినీ ఆకట్టుకుంటున్న అంధుడు "బలగం" రవి బతుకు "వి"చిత్రం ఇది. బలగం సినిమాలో అయ్యో రామ రామ బాలి అనే పాడి చాలా పాపులరైన రవి జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన వాడు. గంగయ్య-సాయమ్మ దంపతులకు ముగ్గురు సంతానం, అందులో ఒక ఆడ, ఇద్దరు మగ పిల్లలు కాగా ఇరువురు అంధులే. గంగయ్య మందుకు బానిసై కట్టుకున్న భార్య, కన్నపిల్లలను వదిలి వెళితే ఆ కుటుంబ భారాన్నంత సాయమ్మే మోసి సాకింది. ఇద్దరు పిల్లలు అంధులే కావటం‌ ఆమెకు మరింత భారమైనా బాధ్యతగా భావించి కన్న కొడుకుల కోసం కూలీనాలీ చేయగా వచ్చిన డబ్బులతో కలోగంజో పోసి పెంచింది. అప్పోసప్పో చేసి కుమార్తెను ఓ అయ్య చేతిలో పెట్టింది.  రవి, గంగాధర్ ఇద్దరు అంధులే అయినా దేవుడు వాళ్లకు మంచి గాత్రానిచ్చాడు. దీంతో‌‌ కొత్తగా వచ్చిన పాటలను వింటూ ఆ పాటలను అద్బుతంగా పాడుతారు. రవి తన గాత్రంతో మంత్రముగ్ధులను చేస్తాడు. అనునిత్యం కొండగట్టు అంజన్న ఆలయానికి వెళ్లి పాటలు పాడుతూ భక్తులు ఉడుత భక్తిగా వేయగా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కన్న తల్లి అనారోగ్యం పాలుకావడంతో రవి పాటనే కుటుంబ జీవనానికి బాటైంది. రవికి రెండు కళ్లు లేకపోయిన అద్బుతమైన గాత్రంతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

ఆలయాలతో పాటు పల్లెల్లో తిరుగుతూ పాటలు పాడగా వచ్చిన డబ్బు కుటుంబ అవసరాలకు వినియోగిస్తున్నాడు. అన్నీ అవయవాలు సరిగా ఉండి సోమరుల్లా తిరుగుతున్న వారికి రెండు కళ్ళు లేక పోయినా తన గానంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న రవి ఆదర్శంగా నిలుస్తున్నారు. తన గొంతు నుండి వచ్చే ప్రతి పాట ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తుంది. అమ్మ కోసం ఆరాటం.. అంధుని బతుకు జీవన పోరాటం... ప్రతి నిత్యం ఆలయాలు, పల్లెపల్లెకు పరుగులు పెట్టిస్తుంది. నూతనంగా వచ్చిన పాటలు నేర్చుకుంటూ ఉదయం పూట బస్సుల్లో వెళ్లి తిరిగి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు. ఉండేందుకు గూడు లేని వారి గోడు ఎవరు పట్టించుకుంటారు. రవి ఆవేదన అరణ్యరోధనే కావడంతో జగిత్యాల జిల్లా మండల కేంద్రమైన మేడిపల్లి శివారులో తాత్కాలికంగా కవర్ల షెడ్డు లాంటి పూరి గుడిసె వేసుకుని ఆ ఆవాసంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల విడుదలైన బలగం సినిమాలో "రవి"అయ్యో రామ రామ బాలి అని పాడిన పాటతో చాలా ఫేమస్ అయ్యాడు. ఏదిక్కు లేనోళ్ళకు పెద్దదిక్కై ప్రభుత్వం ఆదుకొని కూడు, గూడు, గుడ్డ కల్పించాలని "బలగం" చిత్రం గాయకుడు రవి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.