భద్రాద్రి కలెక్టర్ జితేష్ వీ పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): బాలల రక్షణకే బాల రక్షా భవన్ ఏర్పాటు చేశామని కలెక్టర్ జితేష్ వీ పాటిల్ అన్నారు. మంగళవారం భద్రాద్రి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలరక్షా భవన్‌ను ఆయన పరిశీలించారు. భవనంలోని అన్ని గదులను పరిశీలించారు.
బాలల రక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బాల రక్షా భవన్‌లో కావల్సిన వస్తువులు, కంప్యూటర్లు ఇతర సామగ్రి కోసం నివేదికలు అందజేయాలని మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినాను ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. బాల రక్షాభవన్‌లో జిల్లా బాలల పరిరక్షణ విభాగం, బాలల సంక్షేమ సమితి, బాలల న్యాయమండలి, ప్రత్యేక బాలల పోలీస్ విభాగం, జాతీయ బాల కార్మిక నిర్మూలనా పథకం, జిల్లా ప్రొబేషన్ ఆఫీసర్, చైల్డ్ లైన్ అన్నీ కలిసి ఒకేచోట అందుబాటులో ఉంటాయన్నారు.
బాలల రక్షణకు సంబంధించిన అన్ని అంశాలు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని పేర్కొన్నారు. ఆయనవెంట సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ భారతీయ రాణి, డీసీడీవో హరికుమారి, సీడబ్ల్యూసీ సభ్యులు సుమిత్రాదేవి, షాదిక్‌పాషా ఉన్నారు.