23, అక్టోబర్, 2022..
టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ పాకిస్థాన్ మ్యాచ్! మొదట పాకిస్థాన్ 159 పరుగులు చేయగా..
ఛేదనలో టీమిండియా 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. షాహీన్ షా, నసీమ్ షా, హరీస్ రవుఫ్ విజృంభిస్తుండటంతో పరుగు పరుగుకు పరితపించాల్సిన పరిస్థితి. సాధించాల్సిన రన్‌రేట్ కొండలా పెరిగిపోతోంది.. టీమిండియా
నెగ్గాలంటే చివరి 18 బంతుల్లో 48 పరుగులు కావాలి. మెల్‌బోర్న్ స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షిస్తున్న సుమారు లక్ష మంది
అభిమానులతో పాటు.. టీవీ సెట్లకు
కళ్లప్పగించిన కోట్లాది మంది అభిమానులు దాదాపు ఆశలు వదిలేసుకున్న తరుణమది..!
9, జూన్, 2024..
రెండేండ్ల తర్వాత మరోసారి ఐసీసీ మెగాటోర్నీలో చిరకాల ప్రత్యర్థుల మధ్య సమరం! మేఘావృతమైన వాతావరణంలో బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 119 పరుగులకే ఆలౌటైంది. వరల్డ్‌కప్‌లో ఇంత తక్కువ స్కోరు గతంలో ఎప్పుడూ డిఫెండ్ చేసుకోలేకపోయిన టీమిండియాకు ఓటమి తప్పదని అందరూ అంచనాకు వచ్చేశారు. అందుకు తగ్గట్లే.. ఛేదనలో సాఫీగా సాగిన పాకిస్థాన్ 48 బంతుల్లో 48 పరుగులు చేస్తే చాలు అనే దశకు చేరుకుంది.
చేతిలో 8 వికెట్లు ఉండటంతో ఎలాంటి పిచ్‌పైనైనా ఇది పెద్ద సమీకరణం కాకపోవడంతో టీమిండియా బ్యాక్‌ఫుట్‌పై నిలిచింది!
ఈ రెండు సందర్భాల్లోనూ టీమిండియా ఆశలు అడుగంటిపోగా.. పరాజయం చుట్టుముట్టేసింది. కానీ, బలమైన సంకల్పం ముందు విధిరాత కూడా తలవంచుతుందన్నట్లు.. గెలవాలనే పట్టుదలను నరనరాన పునికిపుచ్చుకున్న రోహిత్‌సేన పట్టు విడవలేదు! గత వరల్డ్‌కప్‌లో చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపితే.. ఈ సారి ఆ బాధ్యత బుమ్రా భుజానికెత్తుకున్నాడు. మన విజయానికి కేవలం 8 శాతమే అవకాశం ఉన్న సమయంలో విశ్లేషణలు, వ్యాఖ్యానాలను తప్పని నిరూపిస్తూ.. నీలి రంగు పులుముకున్న న్యూయార్క్ నగరంలో టీమిండియాతో సింహనాధం చేయించాడు.
‘హార్‌కే జీత్ నే వాలేకో బాజీగర్ కహతే హై’
(ఓటమి అంచుల్లో నుంచి తిరిగి పుంజుకొని విజయం సాధించే
వాడిని బాజీగర్ అంటారు).. అనే బాలీవుడ్ డైలాగ్‌ను గుర్తుచేస్తూ.. టీమిండియా ఫీనిక్స్ పక్షిలా తిరిగి తలెగరేసింది.
ఈ రెండు సందర్భాలను మరోసారి మననం చేసుకుంటే..
విజయక్రాంతి క్రీడావిభాగం : పోరాటం నీ ఊపిరి అయితే.. విజయం నీ పాదాక్రాంతమవుతుంది అనేందుకు టీమిండియానే నిదర్శనం. ఓటమి మబ్బు లు కమ్ముకుంటున్నా.. ప్రత్యర్థి ఆటగాళ్లు సంబరాలకు చేరువవుతున్నా.. పట్టువదలని సంకల్పంతో కడవరకు కొట్లాడిన రోహిత్‌సేన టీ20 ప్రపంచకప్‌లో రెండో విజయం ఖాతాలో వేసుకుంది. తొలిసారి మెగాటోర్నీకి ఆతిథ్యమిస్తున్న అమెరికాలో టీమిండి యా మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. బేస్‌బాల్‌ను విపరీతంగా ఆదరించే న్యూయార్క్ ప్రేక్షకులకు భారత్, పాక్ మ్యాచ్ అసలు సిసలు క్రికెట్ మజాను పంచింది.
సిక్సర్లు, ఫోర్లు పెద్దగా నమోదు కాకపోయినా.. 22 గజాల పిచ్‌పై మహాసంగ్రామాన్ని వీక్షించినంత మజా అయితే వచ్చింది. ప్రపంచ అత్యుత్తమ బౌలర్ అని తనను ఎందుకంటారో.. బుమ్రా మరోసారి నిరూపించాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ సారథి బంతిని అతడివైపే ఎందుకు విసురుతాడో.. పాక్‌తో పోరు చూసిన వాళ్లకు సులువుగానే అర్థమై ఉంటుంది. స్వల్ప లక్ష్యం.. అందులోనూ వాతావరణం ఎండకాయడంతో బంతి చక్కగా బ్యాట్‌పైకి వస్తోంది. ఇలాంటి సమయంలో పాక్‌ను ఆపడం కష్టతరమే అని అంతా భావించారు. కానీ టీమిండియా మాత్రం ఓటమి అంగీకరించలేదు.
కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తోడు పకడ్బందీ ఫీల్డింగ్‌తో దాయాదిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒత్తిడికి గురైన పాక్ బ్యాటర్లు అడ్డదిట్ట షాట్ల జోలికి పోవడంతో మన బౌలర్ల పని మరింత సులువైంది. పాక్ ఇన్నింగ్స్ భారాన్ని మోస్తున్న ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్‌ను 15వ ఓవర్ తొలి బంతికి జస్ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ యూటర్న్ తీసుకోగా.. పాకిస్థాన్ విజయానికి 12 బంతుల్లో 21 పరుగులు చేయాల్సిన దశలో 19వ ఓవర్ వేసిన బుమ్రా 3 పరుగులే ఇచ్చి ఇఫ్తిఖార్‌ను ఔట్ చేయడంతో ఆ జట్టు ఆశలు వదిలేసుకుంది. ‘భారత బ్యాటర్లు విజయాన్ని పళ్లెంలో పెట్టి పాకిస్థాన్‌కు అప్పగిస్తే.. మనవాళ్లే దాని విలువ తెలుసుకోలేక కాలితో తన్నారు’ అని పాకిస్థాన్ మాజీలు విమర్శిస్తున్నారంటే ఈ మ్యాచ్‌లో దాయాది ప్రదర్శన ఎలా సాగిందో అర్థ ంచేసుకోవచ్చు!
షాట్ అఫ్ ది డికేడ్..
రెండేళ్ల క్రితం మ్యాచ్‌లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి! గ్రూప్ భాగంగా ఆడిన చివరి మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకున్నాయి. మొదట పాక్ 159 రన్స్ చేస్తే.. ఛేదనలో రాహుల్, రోహిత్, సూర్యకుమార్, అక్షర్ పటేల్ నిరాశ పరిచారు. ఒక ఎండ్‌లో హార్డ్ హిట్టర్ హార్దిక్ ఉన్నా.. అతడు కూడా భారీ షాట్లు ఆడలేక ఇబ్బంది పడుతున్న సమయమది. చివరి మూడు ఓవర్లలో 48 పరుగులు చేయాల్సిన దశలో భారత్ విజయావకాశాలు కేవలం 15 శాతమే కనిపిస్తున్న వేళ.. కోహ్లీ కదంతొక్కాడు. ఒత్తిడి ఎంత ఎక్కువ ఉంటే.. అంత అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడనే పేరున్న విరాట్.. మెల్‌బోర్న్‌లో చిరకాల ప్రత్యర్థిపై సునామీలా విరుచుకుపడ్డాడు.
18వ ఓవర్‌లో మూడు ఫోర్లు బాదిన కోహ్లీ.. హరీస్ రవుఫ్ వేసిన 19వ ఓవర్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన తీరు నభూతో! అందులో ఐదో బాల్‌కు బౌలర్ తలమీదుగా కొట్టిన షాట్ అయితే ఈ దశాబ్దంలోనే అత్యుత్తమ క్రికెటింగ్ షాట్‌గా మనన్నలు పొందింది. కోహ్లీ దెబ్బకు లయ కోల్పోయిన పాక్.. చివరి ఓవర్‌లో 16 పరుగులను కూడా డిఫెండ్ చేసుకోలేక ఘోర పరాజయం మూటగట్టుకుంది. వీరోచిత ఇన్నింగ్స్‌తో టీమిండియాను విజయతీరాలకు చేర్చి విరాట్‌ను అసేతు హిమాచలం పొగడ్తల్లో ముంచెత్తగా.. ఇప్పుడు అదే కర్తవ్యం బుమ్రా తీసుకొని జట్టును ముందుండి నడిపించాడు.