రెట్టింపునకుపైగా పెరిగిన షేరు ధర
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: ఐపీవోలో భారీ స్పందనను అందుకున్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సోమవారంనాడు లిస్టింగ్‌లోనూ అదరగొట్టింది. ఆఫర్ ధర రూ.70తో పోలిస్తే బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ రెండు ఎక్సేంజీల్లోనూ రెట్టింపునకుపైగా 114 శాతం ప్రీమియంతో రూ.150 వద్ద లిస్టయ్యింది. లిస్టింగ్ ధర నుంచి మరో 10 శాతం పెరిగి రూ.165 అప్పర్‌లిమిట్ వద్ద ఫ్రీజ్ ఆయ్యింది. మొత్తంమీద లిస్టింగ్ తొలిరోజున ఐపీవో ఇన్వెస్టర్లకు 135 శాతం లాభాన్ని అందించింది. ఎన్‌ఎస్‌ఈలో రూ.9,983 కోట్ల విలువైన 67 కోట్ల షేర్లు చేతులు మారాయి.
క్లోజింగ్ సమయానికి 40 లక్షల షేర్లకు కొనుగోలు ఆర్డర్లు ఉన్నాయి. గతవారం రూ.6,500 కోట్ల సమీకరణకు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ జారీచేసిన ఐపీవో 63.60 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఐపీవో ద్వారా రూ.3,500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయగా, రూ. 3,000 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో మాతృసంస్థ బజాజ్ ఫైనాన్స్ విక్రయించింది. గతవారం మెయిన్‌బోర్డ్‌లో వచ్చిన మరో రెండు ఐపీవోలు టొలిన్ టైర్స్, క్రాస్ కంపెనీ షేర్లు వారి ఆఫర్ ధరతో దాదాపు సమానంగా ఫ్లాట్‌గా లిస్టయ్యాయి.