calender_icon.png 12 January, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ ష్యూరిటీ పత్రాలతో బెయిల్?

12-01-2025 12:10:35 AM

  • ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడికి ముగ్గురి సహకారం
  • నిందితులను అరెస్టు చేసిన పోలీసులు 

నల్లగొండ, జనవరి 11 (విజయక్రాంతి): ఆరేండ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన బీహార్‌కు చెందిన అండర్ ట్రయల్ ఖైదీ సుభాష్‌శర్మకు బెయిల్ ఇప్పించేందుకు నల్లగొండ కోర్టులో నకిలీ ష్యూరిటీ పత్రాలు ఇచ్చిన ముగ్గురిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. మిర్యాలగూడలోని తన కార్యాలయంలో డీఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు.

2018లో జరిగిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అండర్ ట్రయల్ ఖైదీ సుభాష్‌శర్మ రెండుసార్లు బెయిల్‌కు ప్రయత్నించగా విచారణకు ఆటంకం కలుగుతుందని పోలీసులు కోర్టుకు నివేదించి అడ్డుకున్నారు. 2024 నవంబర్‌లో నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. కేసు విచారణ జరుగుతున్న న్యాయస్థానంలో ష్యూరిటీ సమర్పించి బెయిల్ పొందాలని హైకోర్టు ఆదేశించింది.

లాయర్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన వంగాల సైదులు, మాడుగులపల్లి మండలం పాములపహాడ్ గ్రామానికి చెందిన చింతచెర్ల దేవయ్య, ముక్కాముల మల్లేశ్‌తో కలిసి సూర్యాపేటలో ష్యూరిటీ పత్రాలు కొన్నారు. మాడుగులపల్లి మండలం పాములపహాడ్ పంచాయతీ కార్యాలయ ముద్రలు తయారీ చేయించారు.

వీటితో నకిలీ ష్యూరిటీ పేపర్లు తయారు చేసి జిల్లా కోర్టుకు సమర్పించారు. ష్యూరిటీ పేపర్ల పరిశీలనకు కోర్టు పోలీసులకు పంపగా అనుమానం వచ్చి మాడుగులపల్లి, వేములపల్లి పోలీసులతో విచారణ జరిపించారు. విచారణలో పాములపహాడ్ పంచాయతీ కార్యదర్శి పేపర్లు నకిలీవని నిర్ధారించి వేములపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో వేములపల్లి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని వీరి నుంచి 3 సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.