ఆప్ నేతకు సుప్రీంకోర్టులో ఊరట
ఎన్ని రోజులు జైలులో ఉంచుతారని కోర్టు ప్రశ్న
సుప్రీం తీర్పుతో ఆప్‌లో వెల్లివిరిసిన సంతోషం
న్యూఢిల్లీ, ఆగస్టు 9: మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. రూ.10లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీలతో మాజీ మంత్రిని విడుదల చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు తన తీర్పులో సిసోడియాకు కొన్ని షరతులు విధించింది.
తన పాస్‌పోర్టును అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. బెయిల్ రావటంతో సిసోడియా శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులో 2023 ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న మనీశ్ సిసోడియాను అరెస్టు చేశారు. ఆ తర్వాత సీబీఐ ఆరోపణలను బట్టి ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుంది. సీబీఐ అరెస్ట్ చేసిన తర్వాత రెండు రోజులకు తన పదవికి సిసోడియా రాజీనామా చేశారు.
ఎన్ని రోజులు జైలులో ఉంటారు?
సిసోడియా అరెస్ట్ తర్వాత 17 నెలల పాటు జైలులోనే ఉన్నారు. దీంతో ఆయన బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో గతంలో పలుమార్లు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారించిన జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం శుక్రవారం తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ.. కేసులో పురోగతి ఉన్నా లేకపోయినా.. ఒక నిందితుడిని కాలపరిమితి లేకుండా జైలులో ఉంచలేం. అలా చేస్తే ఆ వ్యక్తి హక్కులను హరించడమే అవుతుంది. బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవడం, విడుదల కావడం వారి హక్కు. బెయిల్ అనేది నియమం, జైలు మినహాయింపు అది ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. సిసోడియాకు బెయిల్ లభించడంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవితకు సైతం బెయిల్ లభిస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నియంతృత్వానికి చెంపపెట్టు
సిసోడియాకు బెయిల్ లభించిన నేపథ్యంలో ఆమ్‌ఆద్మీ పార్టీ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ రోజు దేశమంతా ఆనందంగా ఉందని, గత 17 నెలలుగా ఆయనను జైలులో పెట్టారని పేర్కొం ది. పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే ఆయన నేరమా అని ఎంపీ రాఘవ్‌చడ్డా ప్రశ్నించారు. త్వరలోనే సీఎం కేజ్రీవాల్, సత్యేందర్ జైన్‌కు కూ డా న్యాయం జరిగి జైలు నుంచి విడుదల అవుతారని మరో ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ ధీమా వ్యక్తం చేశారు. సిసోడియాకు బెయిల్ రావడంతో ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిశీ భావోద్వేగానికి గురయ్యారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు ఆయన చేసిన కృషి కొందరికి నచ్చలేదని ఆరోపించారు.