calender_icon.png 20 January, 2025 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్‌పై బాహాబాహీ

25-07-2024 12:51:18 AM

అధికార, విపక్షాల మాటల యుద్ధం

రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్

ప్యాకేజీ సర్కార్: అఖిలేశ్‌యాదవ్

రెండు రాష్ట్రాల కోసమే బడ్జెట్: ఖర్గే

అన్ని పేర్లు చదవాలా?: నిర్మల

న్యూఢిల్లీ, జూలై 24: కేంద్రబడ్జెట్‌పై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను తీవ్ర నిర్లక్ష్యం చేశారని విపక్ష ఎంపీలు బుధవారం పార్లమెంటు లోపల, బయట ఆందోళనకు దిగారు. రాజ్యసభలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కు, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. లోక్‌సభలో స్పీకర్ ఓంబిర్లా, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకొన్నది. 

కుర్చీ బచావో బడ్జెట్

వార్షిక బడ్జెట్‌పై కాంగ్రెస్‌సహా విపక్ష పార్టీలన్నీ పార్లమెంటులో బుధవారం పెద్దఎత్తున నిరసన వ్యక్తంచేశాయి. కేంద్రం కొన్ని రాష్ట్రాలపై తీవ్రవివక్ష చూపుతున్నదని పార్లమెంటు బయట కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సహా విపక్షనేతలు ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తంచేశారు. సభల లోపల కూడా తీవ్ర వాదోపవాదాలు నడిచాయి. రాజ్యసభలో ప్రభుత్వ తీరును ఖర్గే ఎండగట్టారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని తిర స్కరించిన రాష్ట్రాలకు బడ్జెట్‌లో నిధులివ్వలేదు.

అన్ని రాష్ట్రాల ప్లేట్లు ఖాళీగానే ఉన్నాయి. రెండు రాష్ట్రాల ప్లేట్లు మాత్రమే పకోడా, జిలేబీతో నిండాయి. మోదీ కుర్చీని కాపాడుకొ నేందుకే ఈ బడ్జెట్‌ను రూపొందించారు’ అని ఖర్గే ఆరోపించారు. ఆ సమయంలో ఆర్థికమంత్రిని సమాధానం చెప్పనివ్వాలని సభాధ్యక్షు డు జగ్‌దీప్ ధన్‌కడ్ ఖర్గేకు సూచించారు. కాగా, రాష్ట్రాల మధ్య సమతూకం లేకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదని ఖర్గే అన్నారు. కాగా, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రాజ్యసభ నుంచి విపక్ష నేతలు వాకౌట్ చేశారు. 

బడ్జెట్‌లో రాష్ట్రాల పేర్లన్నీ చదవాలా?

ఖర్గే విమర్శలను నిర్మల తిప్పికొట్టారు. బడ్జెట్ ప్రసంగంలో అన్ని రాష్ట్రాల పేర్లు చదివితేనే వాటికి నిధులిచ్చినట్టు అవుతుందా అని ప్రశ్నించారు. ‘ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌గానీ, తాజా పూర్తి స్థాయి బడ్జెట్‌లోగానీ చాలా రాష్ట్రాల పేర్లు నేను చదవలేదు. ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాలు అమలుచేయబోమని కాదు కదా? అన్నారు.

గ్యారెంటీ ఇచ్చేదాకా వదలం: రాహుల్

పంటలకు ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించేదాకా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉంటామని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రకటించారు. ఈ డిమాండ్ సాధన కోసం ఇండియా కూటమి పార్టీలన్నింటితో సమావేశమై కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించాం. రైతుల కోసం ఎంఎస్పీకి చట్టబద్ధత ఇవ్వాల్సిందే’ అని ట్వీట్ చేశారు.