28-03-2025 12:00:00 AM
-రైతాంగ సమస్యల పరిష్కారమే లక్ష్యం
ఖమ్మం, మార్చి, 27 ( విజయక్రాంతి):- తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులుగా తిరిగి బాగం హేమంతరావు ఎన్నికయ్యారు. నిజామాబాద్లో ఈనెల 25, 26, 27 తేదీల్లో జరిగిన రాష్ట్ర మహాసభల్లో హేమంతరావును తిరిగి రెండవ సారి రాష్ట్ర అధ్యక్షునిగా మహాసభ ఎన్నుకుంది.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముటాపురం గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన హేమంతరావు విద్యార్థి, యువజన ఉద్యమాలలో చురుకైన పాత్ర నిర్వహించారు. విద్యార్థి సంఘం (ఏఐఎస్‌ఎఫ్) జిల్లా అధ్యక్షునిగా, కార్యదర్శిగా, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా పని చేసిన హేమంతరావు సుదీర్ఘ కాలం సిపిఐ ఉమ్మడిజిల్లా కార్యదర్శిగా అవశేష ఖమ్మంజిల్లా కార్యదర్శిగా కూడా పనిచేశారు.
ప్రస్తుతం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా, జాతీయ సమితి సభ్యులుగా పనిచేస్తున్నారు. ఈ సందర్బంగా హేమంతరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పక్షాన రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామన్నారు.