calender_icon.png 21 September, 2024 | 5:56 AM

బడుల్లో మళ్లీ సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం!

21-09-2024 02:54:34 AM

  1. స్కీమ్ పేరు మార్చి కొత్తగా అమలు చేసేందుకు రంగం సిద్ధం
  2. పైలట్ ప్రాజెక్టు కింద కొడంగల్‌లో ప్రారంభం
  3. దాతల సాయంతో అమలు చేసేందుకు కసరత్తు

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): సర్కార్ బడుల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను మళ్లీ అమల్లోకి తేవాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం దాతల సహకారం తీసుకోవాలని భావిస్తోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వహయాంలోనే కొన్ని స్కూళ్లలో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత నిధుల కొరత, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ పథకం అటకెక్కింది.

తాజాగా పథకం పేరును  మార్చి కొత్త పథకంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని మళ్లీ ప్రారంభించను న్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని 26 వేలకుపైగా స్కూళ్లలో ఈ పథకాన్ని విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనిపై అటు ప్రభుత్వం.. ఇటు పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు జరుపుతున్నారు. 

నిధుల్లేకనే దాతల వేట..

ఈ పథకానికి నిధులు సమకూర్చలేకనే దాతలు, సీఎస్సార్ నిధుల సేకరణకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రం ఆర్థికలోటులో ఉంది. సంక్షేమ పథకాలకే బడ్జెట్ సరిపోవడంలేదు. ఈ తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వం రూ. 71,495 కోట్ల అప్పుచేసింది. సీఎం బ్రేక్‌ఫాస్ట్‌కు ఏటా రూ. 700 కోట్లు ఖర్చుచేయాల్సి ఉండటంతో నిధుల్లేక దాతల సహకారం కోరుతున్నారు. వాస్తవానికి బ్రేక్ ఫాస్ట్ స్కీం పాతదే. కానీ గత ప్రభుత్వం నిధులను పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడంతో ఈ స్కీమ్ కొన్ని పాఠశాలలకే పరిమితమైంది. ప్రస్తుత ప్రభుత్వం సైతం సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీంకు నిధులను కేటాయించకపోవడంతో పూర్తిగా మరుగునపడింది. విద్యార్థుల ఆకలి తీర్చే పథకం కావడంతో మళ్లీ దీన్ని ప్రారంభించాలని భావిస్తోంది. 

3,500 స్కూళ్లలోనే అమలు..

ఉదయం వేళల్లో విద్యార్థులు ఖాళీ కడుపుతో బడికి వస్తుంటారు. వీరి ఆకలిని తీరిస్తే పాఠశాలల్లో డ్రాపౌట్ల సంఖ్య తగ్గుతుందని భావించిన అప్పటి ప్రభుత్వం సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2023, అక్టోబర్ 6న ఈ పథకాన్ని అప్పటి మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లాలోని రావిర్యాల ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించారు. దాదాపు 23 లక్షల విద్యార్థులకు లద్ధిచేకూర్చేలా ఈ పథకాన్ని అప్పట్లో రూపకల్పన చేశారు.

ఈ పథకాన్ని రాష్ర్టంలోని 27,147 బడుల్లో అమలు చేయాలని సంకల్పించి రూ. 672 కోట్లను గత ప్రభుత్వం కేటాయించింది. తొలుత నియోజకవర్గానికి ఒక స్కూల్ చొప్పున 119 స్కూళ్లల్లో ప్రారంభించగా, ఆ తర్వాత మండలానికో స్కూల్ చొప్పున ప్రారంభించారు. క్రమంగా మండలానికి రెండు, మూడు చొప్పున విస్తరించారు. ఇలా రాష్ట్రంలోని 3,500 స్కూళ్లల్లో మాత్రమే ఈ స్కీమ్ అమలైంది. మిగతా స్కూళ్లలో అమలుకు నోచుకోలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఈ పథకానికి బ్రేక్‌లు పడ్డాయి. మళ్లీప్పుడు దీన్ని ప్రారంభించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

గతంలో బ్రేక్ ఫాస్ట్ స్కీం లబ్ధిదారులు

యాజమాన్యం 1-5 6 - 8 9 -- 10 

తరగతులు తరగతులు తరగతులు

ప్రభుత్వ, జిల్లా,

మండల పరిషత్ 11,57,541 6,18,463 3,65,138    

ఎయిడెడ్ 37,473 23,340 13,823     

మాడల్ స్కూళ్లు - 49,715 36,270   

మదర్సాలు 2,493 1,491 54

మొత్తం 11,97,507 6,93,009 4,15,285