- నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్
- ప్రకటించిన ఎల్‌అండ్‌టీహెచ్ ఎమ్‌ఆర్‌ఎల్ అధికారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (విజయక్రాంతి): నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో దశల వారీగా పెయిడ్ పార్కింగ్‌ను అమలు చేయబోతున్నట్లు ఎల్‌అండ్‌టీహెచ్‌ఎమ్‌ఆర్‌ఎల్ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ స్టేషన్లలో అమలులో ఉన్న ఫ్రీ పార్కింగ్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 25 నుంచి నాగోల్ మెట్రో స్టేషన్‌లో, సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్‌లో పార్కింగ్ ఫీజులను అమలు చేయబోతున్నట్లు ఆ సంస్థ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
కాగా పనితీరు, సామర్థ్యాన్ని పరీక్షించేందుకు బుధవారం నాగోల్ మెట్రో స్టేషన్‌లో పెయిడ్ పార్కింగ్‌ను పైలట్ రన్‌గా అమలు చేసినట్లు పేర్కొన్నారు. బైక్‌లు, నాలుగు చక్రాల వాహనాలకు మధ్య స్పష్టమైన హద్దులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్కింగ్ స్థలాల్లో బయో టాయిలెట్లు ఏర్పాటు చేస్తామని, సీసీ కెమెరాల నిఘా, ఆన్ గ్రౌండ్ భద్రత కల్పిస్తామని చెప్పారు. పార్కింగ్ ఫీజు చెల్లింపులను సులభతరం చేస్తామని, క్యూఆర్ కోడ్‌లు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.
నాగోల్ మెట్రో స్టేషన్‌లో నిరసన..
నాగోల్‌లో బుధవారం ఎల్‌అండ్‌టీహెచ్‌ఎమ్‌ఆర్‌ఎల్ పెయిడ్ పార్కింగ్‌పై పైలట్ రన్ చేపట్టిన సందర్భంగా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే ఛార్జీల కోసం బోర్డులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఎల్‌అండ్‌టీ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇంత కాలం ఫ్రీ పార్కింగ్ సదుపాయం కల్పించి ఇప్పుడు పెయిడ్ పార్కింగ్ అమలు చేయడమేంటని విమర్శించారు. తమకు ఇచ్చిన పెయిడ్ పార్కింగ్ టికెట్లను వెనక్కి తీసుకొని ఫ్రీ పార్కింగ్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాగా, ఇప్పటికేపలు స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్‌ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దాదాపు 40 స్టేషన్లలో పార్కింగ్ సదుపాయం ఉంది.
పార్కింగ్ ఫీజుల వివరాలు..
బైక్‌లకు కనీసం 2 గంటలు పార్కింగ్ చేస్తే రూ.10, 8 గంటల వరకు రూ.25, 12 గంటల వరకు రూ.40 చెల్లించాలని మెట్రో స్టేషన్ల వద్ద ఎల్‌అండ్‌టీ ఏర్పాటు చేసిన బోర్డుల్లో పేర్కొన్నారు. అలాగే కార్లకు 2 గంటలు పార్కింగ్‌కు రూ.30, 8 గంటల పార్కింగ్‌కు రూ.75, 12 గంటల పార్కింగ్‌కు రూ.120 చొప్పున ఫీజులను నిర్ణయించారు.