calender_icon.png 9 October, 2024 | 6:54 PM

సెమీఫైనల్లో బడోసా

04-10-2024 12:03:27 AM

కోకో గాఫ్ కూడా

చైనా ఓపెన్

బీజింగ్: చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో స్పెయిన్ సంచలనం పౌలా బడోసా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో బడోసా 6-1, 7-6 (7/4)తో స్థానిక క్రీడాకారిణి జాంగ్‌ను చిత్తుగా ఓడించింది. గంటకు పైగా సాగిన పోరులో బడోసా రెండు సెట్లలో ప్రత్యర్థిని చిత్తు చేసింది.

మ్యాచ్‌లో 10 ఏస్‌లు సంధించిన బడోసా 31 విన్నర్లు సంధించింది. మరోవైపు ఒక్క ఏస్ కొట్టని జాంగ్ నాలుగు డబుల్ ఫాల్ట్స్‌తో పాటు 24 విన్నర్లు మాత్రమే కొట్టి మూల్యం చెల్లించుకుంది.

కాగా బడోసాకు గత 35 మ్యాచ్‌ల్లో ఇది 28వ విజయం కావడం విశేషం. మే నుంచి చూసుకుంటే బడోసా ఐదు టోర్నీల్లో సెమీస్‌కు వరకు చేరుకోగలిగింది. ఇక యూఎస్ ఓపెన్‌లోనూ బడోసా క్వార్టర్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మరో సింగిల్స్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కోకో గాఫ్ (అమెరికా) సెమీస్‌లో అడుగుపెట్టింది.

క్వార్టర్స్‌లో గాఫ్ 2-6, 6-2, 6-2తో ఉక్రెయిన్ క్వాలిఫయర్ యులియా స్టార్‌డుబ్ట్సోవాను ఓడించింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను కోల్పోయిన గాఫ్ ఆ తర్వాత అద్భుతంగా ఫుంజుకుంది. వరుసగా రెండు సెట్లలో గెలుపొంది సునాయాస విజయాన్ని అందుకుంది. సెమీస్‌లో గాఫ్ బడోసాతో అమీతుమీ తేల్చుకోనుంది.

షాంగై మాస్టర్స్‌కు అల్కారాజ్, సిన్నర్

చైనా ఓపెన్ కైవసం చేసుకున్న కార్లోస్ అల్కరాజ్ షాంగై మాస్టర్స్‌లో బరిలోకి దిగనున్నాడు. అల్కరాజ్‌తో పాటు రన్నరప్ సిన్నర్ కూడా టోర్నీలో ఆడనున్నాడు. అల్కరాజ్ చైనాకు చెందిన షాంగ్‌తో, టారో డేనియల్ (జపాన్)తో సిన్నర్ తొలి రౌండ్ ఆడనున్నారు. ఇక జపాన్ ఓపెన్‌లో గాయంతో మధ్యలోనే వైదొలిగిన ఇటలీ స్టార్ మాట్టియో బెరెట్టిని షాంగై మాస్టర్స్ టోర్నీలో శుభారంభం చేశాడు.

తొలి రౌండ్‌లో బెరెట్టిని 7-6 (11/9), 7-6 (8/6)తో ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్టోఫర్ కొన్నెల్‌ను ఓడించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు. తర్వాతి రౌండ్‌లో బెరెట్టిని హోల్గర్ రూనెను ఎదుర్కోనున్నాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో వావ్రింకా (స్విట్జర్లాండ్) 7-6 (7/2), 7-6 (8/6)తో పెర్రికార్డ్‌పై, బెల్లూసి 6-3, 6-4తో హారిస్‌పై, అటమనె 6-4, 7-6 (7/4)తో అమెరికాకు చెందిన కొవాసెవిక్ విజయాలు సాధించారు. ఇక భారత్‌కు చెందిన రామనాథన్ 1-6, 6-3 (3/7)తో షెవ్‌చెంకో చేతిలో ఓటమి పాలై తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు.