ఎన్టీఆర్, అంజలి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బడిపంతులు’. ఈ సినిమా 1972 నవంబర్ 22న అంటే ఇవాళ్టి రోజున విడుదలైంది. ఎన్టీఆర్ ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. ఆయన భార్య అంజలీదేవి. ఇద్దరూ విలువలతో కూడిన జీవితం గడుపుతుంటారు. వారి కుమారులుగా కృష్ణంరాజు, జి. రామకృష్ణ నటించారు. ఎన్టీఆర్ కష్టపడి ఓ ఇల్లు నిర్మించుకుంటారు. ఆయన పదవీ విరమణ అనంతరం పిల్లలు తండ్రినొకరు.. తల్లినొకరు పంచుకుంటారు.
ఆ తరువాత ఎన్టీఆర్, అంజలి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారిద్దరినీ తిరిగి ఒకచోట చేర్చించిందెవరు? వంటి అంశాలతో ఈ కథ రూపొందింది. కన్న బిడ్డల కన్నా సాయం పొందిన బయటి వారే మిన్న అని ఈ చిత్రం తెలియజేస్తుంది. ఆద్యంతం భావోద్వేగాలతో కట్టిపడేసే చిత్రమిది. ఈ చిత్రంలో శ్రీదేవి.. ఎన్టీఆర్ మనవరాలి పాత్రను పోషించారు. కీలక పాత్రల్లో జగ్గయ్య, షావుకారు జానకి, జయంతి, రాజమాబు, రమాప్రభ, సూర్యకాంతం, నాగభూషణం తదితరులు నటించారు. ముఖ్యంగా వృద్దుల సమస్యలను హైలైట్ చేస్తూ తీసిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.