22-04-2025 01:36:17 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మీ పిల్లలను పైసల బడికి పంపకండి.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా విద్య నేర్పి ఏడాదికి రెండు జతల దుస్తులు, పాఠ్యపుస్తకాలు, ఉచితంగా వైద్య పరీక్షలు, వారానికి మూడు కోడిగుడ్లతో రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించే ప్రభుత్వ బడికి మీ పిల్లలను పంపి భవిష్యత్తు తీర్చిదిద్దాలని తల్లిదండ్రులను కోరుతూ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు గ్రామాల్లో ‘బడిబాట’ నిర్వహిస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో గత రెండు రోజులుగా ఉపాధ్యాయులు తమ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని ఇంటింటికి తిరుగుతూ తల్లిదండ్రులను కోరుతున్నారు. మీ పిల్లలను ప్రభుత్వ బడికి పంపించి బడిని బ్రతికించడంతోపాటు పిల్లలకు మంచి భవిష్యత్తు అందించే విద్యా బోధన అందిస్తామని హామీ ఇస్తున్నారు. కొందరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపేందుకు అంగీకరిస్తూ హామీ పత్రం ఇస్తున్నారు. దీంతో ఒక్కో పాఠశాలలో ఐదు నుండి పదిమంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నట్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు.