calender_icon.png 19 March, 2025 | 12:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధ్వాన రహదారి...!

19-03-2025 02:10:03 AM

అడుగడుగునా గుంతలు 

అవస్థలు పడుతున్న ప్రయాణికులు 

పట్టించుకోని అధికారులు, పాలకులు

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 18(విజయ క్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని బలాన్ పూర్ గ్రామానికి పంచాయతీరాజ్ శాఖ నిధుల ద్వారా రూ: 3.40 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. దాదాపుగా 22 కిలోమీటర్ల మేర చేపట్టిన రోడ్డు మరమ్మతులకు నోచుకోకపోవడంతో అధ్వానమైన పరిస్థితి నెలకొంది. 

ఆర్ అండ్ బి రోడ్డు నుండి అంకుసాపూర్, బాబాపూర్ , మోవాడ్ తో పాటు  ఏజెన్సీ గ్రామాలకు ఒకేదారి అయినప్పటికీ రోడ్డు పై పడ్డ గుంతలను పూడ్చకపోవడంతో  ఆ గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు గుండా రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయం, మెడికల్ కళాశాల, పౌరసరఫరాల శాఖ గిడ్డంగులు, మైనార్టీ గురుకుల పాఠశాల, మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ప్రతిరోజు వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, పదుల సంఖ్యలో ఆటోలలో ప్రజలు ప్రయాణిస్తుంటారు.

దీంతోపాటు మెడికల్ కళాశాల చెందిన భవన నిర్మాణాలు జరుగుతుండడంతో ఇసుక, కంకర, సిమెంటు వాహనాలు వస్తుండడం, కళాశాల పక్కనే హార్ట్ మిక్చర్ ప్లాంట్ సైతం ఇసుక ,కంకరను వాహనాలు తరలిస్తున్నాయి.పౌరసరఫరాల శాఖ గిడ్డంగులకు భారీ వాహనాలలో రేషన్ బియ్యం తరలిస్తుండడంతో రోడ్డు మరింత చెడిపోతూ వస్తుంది. వైద్య కళాశాల, గురుకుల పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సిబ్బంది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు ద్విచక్ర వాహనాలు ప్రమాదానికి గురవుతున్న సందర్భాలున్నాయి. రోడ్డుకు మరమ్మతులు చేయాలని సమీప గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

రోడ్డుకు మరమ్మత్తులు  చేయించాలి

 ఆర్ అండ్ బి రోడ్డు నుండి బాలాన్ పూర్ వరకు  దాదాపు 15 ఏళ్ల క్రితం రోడ్డు నిర్మా ణం చేపట్టారు. రోడ్డుపై గుంతలు అడ్డప్పటికీ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో రోడ్డు అద్వానంగా మారింది. సంబంధిత అధికారులు రోడ్డుకు మరమ్మత్తు లు చేసి ప్రజలు పడుతున్న అవస్థలకు స్వస్తి పలకాలి. ఈ రోడ్డు గుండా ప్రతిరోజు ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటి నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలి. భారీ వాహనాల రాకపోకలు పెరగడంతో రోడ్డు పై రోజురోజు గుంతలు పెరుగుతున్నాయి.

 కవల్కార్ రాజు, బాబాపూర్