calender_icon.png 6 October, 2024 | 3:51 PM

రుణమాఫీ, హైడ్రాపై దుష్ప్రచారం మానుకోవాలి

06-10-2024 12:10:25 AM

జిల్లాలకూ హైడ్రాను విస్తరిస్తాం

బీఆర్‌ఎస్ నేతల చెరలో ఉన్న 1,500 చెరువులను రక్షిస్తాం

పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ 

నిజామాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): రైతు రుణమాఫీ, హైడ్రాపై బీఆర్‌ఎస్ నాయకులు దుష్ప్రచారం మానుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ సూచించారు. లక్షల కోట్ల ఆదాయం ఉన్న తెలంగాణను బీఆర్‌ఎస్ అప్పుల పాలు చేసిందన్నారు. ప్రస్తుతం ఖజానా ఖాళీ ఐన పరిస్థితుల్లోనూ తాము రుణమాఫీ చేశామని చెప్పారు.

రుణాలు మాఫీ కాలేదని కేటీఆర్, హరీశ్‌రావు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. శనివారం నిజామాబాద్‌లో మీడియాతో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో కేవలం రూ.15 వేల కోట్ల రుణమాఫీ చేస్తే, తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు.

రెండు లక్షలకు పైగా రుణం ఉన్న వారికి త్వరలోనే మాఫీ చేస్తామని మహేష్‌గౌడ్ తెలిపారు. బీఆర్‌ఎస్ చేసిన అప్పులు తీర్చేందుకు, వడ్డీలు చెల్లించేందుకే రూ.12 వేల కోట్లు చెల్లిస్తున్నామని, మిగతాది ఉద్యోగుల జీతాలు, ప్రభుత్వ ఖర్చులు పోను రూ.2 నుంచి రూ.3 వందల కోట్లు మాత్రమే మిగులుతాయని మహేష్‌గౌడ్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో సైతం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. 

హరీశ్‌రావుపై గౌరవం పోయింది

గతంలో హరీశ్‌రావు అంటే గౌరవం ఉండేదని, ప్రస్తుతం అతడి మాటలతో గౌరవం పోయిందని మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేసి మాట తప్పారని పేర్కొన్నారు. కేటీఆర్, హరీశ్‌రావులపై ప్రజలకు నమ్మకం పోయిందని, కేసీఆర్ ఫాం హౌజ్‌కే పరిమితమయ్యారని మహేష్‌గౌడ్ అన్నారు. చెరువులను పరిరక్షించేందుకు హైడ్రాను జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు.

ఆక్రణమల్ని తొలిగించి భవిష్యత్ తరాలకు ఆక్రమణలు లేని చెరువులను అందిస్తామని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులే దాదాపు 1,500 చెరువులను కబ్జా చేశారని, ఆ చెరువులను రక్షిస్తామని అధ్యక్షుడు తెలిపారు. ఎంఐఎం పార్టీతో ప్రస్తుతానికైతే పొత్తులేదని, తమ ప్రభుత్వ విధానాలు నచ్చి వస్తే ఆలోచిస్తామని తెలిపారు.

నిజామాబాద్ జిల్లాలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో గతంలో నడిచి మూతపడ్డ సీఎస్‌ఐ మెడికల్ కళాశాలను తిరిగి ప్రారంభి స్తామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను పటిష్టపరిచే చర్యల్లో భాగంగా ఇప్పటికే 40కి పైగా కార్పొరేషన్ పదవులను భర్తీ చేశామని, రాబో యే రోజుల్లో మరో 20 నుంచి 25 కార్పొరేషన్ చైర్మన్ పదవులను భర్తీ చేస్తామని మహేష్‌గౌడ్ తెలిపారు. త్వరలో జరగబోయే రాష్ట్ర మంత్రి విస్తరణలో నిజామాబాద్ జిల్లాకు చోటు లభిస్తుందని తెలిపారు. 

వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కృషి

పీసీసీ అధ్యక్షుడిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు వెనుకబడిన అదిలాబాద్, మెదక్ జిల్లాల అభివృద్ధికి కృషిచేస్తానని మహేష్‌గౌడ్ తెలిపారు. ఇందులో భాగంగా నిజామాబాద్‌లో పారిశ్రామికంగా అభివృద్ధి జరిగేటట్టు చూస్తానన్నారు. వరి, పసుపు, మొక్కజొన్న పంటలకు మార్కెట్ సదుపాయంతో పాటు, వ్యవసాయ అధారిత పరిశ్రమలు ఏర్పాటుకు ప్రయత్నిస్తానని తెలిపారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని, జిల్లాలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. 

‘సీఎం కప్-2024 టార్చ్’కు స్వాగతం 

నిజామాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్-2024 క్రీడా పోటీల టార్చ్ రిలే శనివారం నిజామాబాద్‌కు జిల్లాకు చేరుకున్నది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ రిలేకు జెండా ఊపి స్వాగతం పలికారు. మహేష్‌గౌడ్‌తో పాటు క్రీడాకారులు, శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసులు, క్రీడా సంఘాల ప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు.