calender_icon.png 23 November, 2024 | 10:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెడ్డ అలవాటు

23-11-2024 12:00:00 AM

రుత్విక్ ఈరోజే కొత్త స్కూల్‌కు వెళ్లాడు. అదీ బస్సులో వచ్చాడు. చాలా కొత్త అనుభవం బాగుంది అనుకున్నాడు. పాత స్కూల్ ఇంటికి దగ్గరే ఉండేది. అందుకని నడిచే వెళ్లేవాడు. అమ్మకానీ, నాన్నకానీ స్కూల్‌దాకా తోడు వచ్చేవారు. ఇక ఇప్పుడు బస్ ఎక్కాలి. బస్‌లో అందరూ అదే స్కూల్‌లో చదివే పిల్లలే. చాలా సరదాగా ఉంది రుత్విక్‌కి. బస్ వెళ్లినంతసేపూ అల్లరే అల్లరి. అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.

సాయంత్రం ఇంటికి వచ్చాక ఆ విశేషాలన్నీ అమ్మకు చెబుతాడు.  కొత్త స్కూల్‌కు రుత్విక్ చాలా సంతోషంగా వెళ్లడం గమనించింది రుత్విక్ అమ్మ రమ్య. అదే విషయాన్ని సంతోషంగా తన భర్త కిరీటితో చెప్పింది. అతనూ సంతోషించాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. 

ఒక వారం రోజులు పోయాక రుత్విక్ ఒక విషయాన్ని కనిపెట్టాడు. తన క్లాస్‌లోని అరుణ్ వేరే వాళ్ళ బాక్సుల్లోంచి పెన్సిళ్లు, రబ్బర్లు కొట్టేస్తున్నాడు. కానీ ఈ విషయం ఎవరూ గమనించట్లేదు. పెన్సిళ్లు, రబ్బర్లు పోయినవాళ్లు కూడా ఏమీ ఫిర్యాదు చేయడటం లేదు. టీచర్లు ఎవరూ అరుణ్‌ని కోప్పడటం లేదు. ఎవరూ అరుణ్‌ను దొంగ అన టం లేదు. హాయిగా దొంగిలించిన పెన్సిళ్లు, రబ్బర్లును తనవే అన్నట్లుగా వాడుకుంటున్నాడు. ఈ విషయం రుత్విక్‌ను ఆశ్చర్యపరిచింది. 

ఇలా వారం రోజులు గమనించాక రుత్విక్‌కు ఒక ఆలోచన వచ్చింది. ‘నేను కూడా అలా పెన్సిళ్లు, రబ్బర్లు వాళ్లకు తెలియకుండా తీసేసుకుంటేనో’ అనుకున్నాడు. మరునాడే ఆచరణలో పెట్టాడు. ఒక పెన్సిల్ ను దొంగిలించి దాచుకున్నాడు. చాలా భయం వేసింది. టీచర్ కొడుతుందేమో అని భయపడ్డాడు. కానీ ఎవరూ గుర్తించలేదు. ఏమీ అనలేదు. దీంతో మరునాడు మరో పెన్సిల్ కొట్టేశాడు. ఇలా రెండు మూడు రోజులు వరసగా పెన్సిళ్లు తీసేసుకున్నాడు. ఎవరూ చూడలేదు, ఏమీ అడగలేదు. 

రమ్య రెండు రోజుల నుంచి గమనిస్తుంది. రుత్విక్ బాక్స్‌లో ఎక్స్ ట్రా పెన్సిళ్లు కనిపిస్తున్నాయి. అవి తను ఇచ్చినవి కావు. తానెప్పుడూ ‘అప్సర’ పెన్సిళ్లనే కొంటుంది. అవేమో ‘నటరాజ్’ పెన్సిళ్లు. ఏదో అనుమానం పొడసూపింది. 

రుత్విక్‌ను మెల్లగా అడిగింది. ‘ఈ ఎక్స్ ట్రా పెన్సిళ్లు ఎక్కడివి’ అని. రుత్విక్ ఏమీ చెప్పలేకపోయాడు. రుత్విక్‌కు అబద్దమాడటం రాదు మరి. రమ్యకు అర్థమైంది. ఇంకాస్త నిదానంగా ‘ఇవెక్కడివి కన్నా’ అని వాడి భుజం మీద చెయ్యేసి అడిగింది. అప్పుడు చెప్పాడు రుత్విక్. ‘రోజూ అరుణ్ వేరేవాళ్ల దగ్గర నుంచి పెన్సిళ్లు తీసుకుంటున్నాడో అది చూసి తను కూడా పక్కనోళ్ళ బ్యాగుల్లో నుంచి పెన్సిళ్లు తీసుకుంటున్నా అన్నాడు. ఇంకా ఎవరూ చూడలేదు మమ్మీ’ అని కూడా అన్నాడు. 

రమ్య వాడినింకా దగ్గరకు లాక్కుంది. వాడి కళ్ళలోకి చూస్తూ ఇలా చెప్పసాగింది. ‘చూడు కన్నా ఎవరు చూసినా, చూడకపోయినా దాన్ని దొంగతనం’ అంటారు. పక్కవాళ్ళ బ్యాగుల్లో నుంచి పెన్సిళ్లు, రబ్బర్లు తీసుకోవడం తప్పు. ఈ తప్పును మొదట్లోనే మానేయాలి. పెరిగి పెరిగి పెద్దయ్యాక ఆ అలవాటు మానుకోవడం కష్టంగా ఉంటుంది. ఇలా చిన్ననాడు అలవాటైన వారే పెద్దయ్యాక పెద్ద దొంగలుగా మారతారు. వారికి శిక్షలు పడుతుంటాయి. అటువంటి జీవితం మనకి వద్దు. 

మేం చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ నిన్ను చదివిస్తున్నాం. నువ్వు మంచి దారిలో నడిస్తేనే మాకు మంచి పేరు వస్తుంది. స్కూళ్ళల్లో చిన్నపిల్లలు కదా.. పెన్సిళ్ళే కదా తీసుకుంటున్నారు అని చూసీ చూడనట్లు వదిలేస్తారు. అది చాలా తప్పు. అప్పుడే వారికి విషయం అర్థమయ్యేలా చెపితే భవిష్యత్తులో దొంగలుగా మారకుండా ఉంటారు. స్కూల్లో ఏమీ అనకపోయినా, వస్తువు పోయిన వాళ్ళు ఫిర్యాదు చేయకపోయినా ఒకరి వస్తువులు తీసుకోకూడదు. 

మన మంచి అలవాటు ఎప్పటికీ మనల్ని కాపాడుతుంది కన్నా.. అంటూ రమ్య చక్కగా బాబుకు అర్థమయ్యేలా చెప్పింది. 

రుత్విక్‌కు విషయమంతా అర్థమై ముఖం తేజస్సుతో వెలిగిపోసాగింది. ‘ఇక నేనెప్పుడూ వేరేవాళ్ళ వస్తువులు తీసుకోనమ్మ’ అంటూ అమ్మను అల్లుకుపోయాడు రుత్విక్. 

- డాక్టర్ కందేపి రాణీప్రసాద్