calender_icon.png 30 September, 2024 | 3:09 AM

గురుకులాల్లో నాసిరకం సరుకులు!

30-09-2024 01:06:37 AM

ఉడుకని పప్పులు, నాణ్యత లేని నూనె

పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

పట్టించుకోని అధికారులు

నిర్మల్, సెప్టెంబర్ 29(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని కేజీబీవీ, సంక్షేమ గురుకులాలకు నాసిరకం సరుకులు సరఫరా అవుతున్నాయి.  సరుకులు సరఫరా చేసే ఏజెన్సీలు టెండర్లలో కోట్ చేసిన సరుకులు కాకుండా నాణ్యత లేని సరుకులు సరఫరా చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తున్నది.

పర్యవేక్షించాల్సిన అధికారులు, ప్రిన్సిపాళ్లు ఏజేన్సీలతో కుమ్మక్కై పట్టించుకోవడం లేదని సమాచారం. దీంతో విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురుకులాలు, కేజీబీవీల్లో సరుకుల సరఫరా, సమస్యల పర్యవేక్షణకు జిల్లాలోని 19 మండలాల్లో 19 మంది ప్రత్యేక అధికారులను నియమించారు.

కానీ వారిపై కొందరు విద్యాశాఖ అధికారులు ఒత్తిడి తేవడంతో భయంతో ఎలాంటి పర్యవేక్షణ చేయడంలేదనే ఆరోపణలొస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం అందడంలేదు. తరుచుగా అనారోగ్యంపాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో 19 కేజీబీవీలు, 19 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, జనరల్ గురుకులాలు 21 ఉండగా.. సమారు 20 వేల మంది పిల్లలు చదువుకుంటున్నారు.

మహిళా కమిషన్ తనిఖీలో వాస్తవాలు

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరేళ్ల శారద నిర్మల్ పట్టణంలోని రెండు పాఠశాలలను శనివారం తనిఖీ చేయడంతో నాసిరకం సరుకులు కంటపడ్డాయి. బియ్యంలో పురుగులు, నాసిరకం కంది పప్పు, జాలీ ఉన్న రవ్వ, కుళ్లిన ఉల్లిగడ్డలు, కూరగాయలు ఉండటంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పాఠశాలలో పిల్లలకు అందిస్తున్న భోజనంలో పురుగులు వస్తున్నాయని, ఉడుకని పప్పు, ఒకే రకం వంటలు పెండుతున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు.