- ఓసీల వద్దే 89 శాతం సంపద
- పదేళ్లలో బీసీల సంపద 9 శాతం తగ్గుదల
- ప్రత్యేక రాష్ట్రంలోనూ మారని ఆర్థిక స్థితి
- ఎస్సీల వద్ద 2.6 శాతం.. జాడ లేని ఎస్టీలు
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయ క్రాంతి): సమాజంలోని ఏ వర్గమైనా.. ఏ ప్రాంతపు వ్యక్తుల స్థాయిని అయినా వారి ఆర్థిక స్థితిగతులను ప్రామాణికంగా తీసుకుని నిర్ధారిస్తారు. ఆయా వర్గాల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలను రూపమాపడమే లక్ష్యంగా దేశంలో రాజ్యాంగ రూపకల్పన జరిగింది. కానీ ఆ లక్ష్యం మాత్రం నెరవేరినట్టు కన్పించడం లేదు. రాజ్యాంగ రూపకల్పనతో సామాజిక అసమానతలు కొద్దోగొప్పో తగ్గినా.. ఆర్థికంగా ఇంకా ఆయా వర్గాల మధ్య సమానత్వం కొరవడింది.
మొత్తం సంపదలో కులాలవారీగా పరిశీలిస్తే.. ఆయా వర్గాల మధ్య ఇంకా కొనసాగుతున్న ఆర్థిక అసమానతలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని మొత్తం సంపదలో దాదాపు 89 శాతం ఉన్నత కులాలవారి దగ్గర ఉన్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. బీసీల దగ్గర కేవలం 9 శాతం సంపదే ఉండటం గమనార్హం. ఇప్పటికే అన్ని రంగాల్లో వెనుకబడుతున్న బీసీలు సంపద విషయంలో మరింత వెనుకబడి ఉన్నారు. అందుకే తమకు న్యాయం జరగాలంటే జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
బీసీల సంపద తగ్గుతూనే ఉంది
ఎన్నో ఏళ్లుగా ఆర్థికంగా బలంగా ఉన్న ఓసీలు ఇంకా బలపడుతూనే ఉన్నారు. ఉన్నత వర్గాల సంపద రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో 21 శాతం ఉన్న ఓసీల వద్ద సుమారు 89 శాతం సంపద ఉండటం విశేషం. జనాభాతో సంబంధం లేకుండా వారి దగ్గర సంపద సమకూరుతుంది. అయితే సంపద విషయంలో బీసీలు అత్యంత వెనుకబడి ఉన్నారు. రాష్ట్రంలో బీసీల జనాభా 60 శాతం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ సంపద విషయంలో మాత్రం ఆ స్థాయిలో పాలుపంచుకోలేకపోతున్నారు.
మొత్తం సంపదలో కేవలం 9 శాతం మాత్రమే బీసీల దగ్గర ఉంది. 2013లో 17.8 శాతం సంపదను కలిగి ఉన్న బీసీలు 2022 సంవత్సరం వచ్చేనాటికి 9 శాతం సంపదను మాత్రమే కలిగి ఉన్నారు. రాజ్యాంగ పరమైన లక్ష్యానికి సంబంధించి ఎలాంటి ప్రతిఫలాలను అందిపుచ్చుకోలేక పోతున్నారు. బీసీల సంపద పెరగకపోగా రోజురోజుకూ మరింత తగ్గుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై బీసీల ఆవేదనలో అర్థం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఎస్సీల దగ్గర 2.6 శాతం.. ఎస్టీల జాడేలేదు
సంపదలో బీసీలతోపాటు ఎస్సీలు, ఎస్టీలు కూడా తగిన భాగస్వామం లేదు. గణాంకాల ప్రకారం 2022లో ఎస్సీలు 2.6 శాతం సంపదను కలిగి ఉన్నారు. 2013లో 1.8 శాతం సంపదను కలిగి ఉన్న ఎస్సీలు 2020 కల్లా 4.1 శాతం సంపదను వృద్ధి చేసుకున్నప్పటికీ మళ్లి 2.6 శాతానికి దిగజారిపోయారు. బీసీలతో పోల్చుకుంటే వారి స్థాయిలో ఎస్సీలు ఆర్థికంగా వెనుకబడి లేకపోయినప్పటికీ జనాభా స్థాయి వారికి తగిన ప్రాధాన్యత లభించడం లేదు. ఇదిలా ఉండగా సంపద జాబితాలో ప్రా మాణికంగా తీసుకునే స్థాయిలో ఎస్టీలు లేకపోవడం గమనార్హం. సంపదలో బీసీలతోపాటు వెనుకబడిన ఎస్సీలు, ఎస్టీలు ఆర్థికంగా సమానత్వం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యేక రాష్ట్రంలోనూ పరిస్థితి మారలె
తెలంగాణ రాష్ట్ర సాధనలో బీసీల పాత్ర ఎంతో కీలకం. ఉద్యమ సమయంలో బీసీలంతా సంఘటితమై పోరాటం చేశారు. కానీ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలోనూ వారి ఆర్థిక పరిస్థితి మాత్రం మారలేదు. తెలంగాణ రాకముందు 2013లో బీసీల సంపద 17.8 శాతం ఉంది. 2014లో 20 శాతం సంపదతో బీసీల వాటా కొంత పెరిగినట్టు అనిపించినా.. ఆ పెరుగుదల ఎక్కువ సమయం నిలువలేదు. అప్పడు మొదలు 2022 వరకు బీసీల సంపద ఏటికేడు తగ్గుతూనే వస్తుంది. మొత్తంగా చూస్తే దాదాపు బీసీల సంపద భాగస్వామ్యం 9 శాతం తగ్గింది. బీసీలు ఈ స్థాయిలో దిగజారిపోతున్నా.. ఓసీల సంపద మాత్రం గణనీయంగా పెరుగుతున్నది. 2013లో 80.3 శాతంగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 78.1 పడిపోయినప్పటికీ 2022 ఏడాది వచ్చే సరికల్లా 88.4 శాతం సంపదను కలిగి ఉన్నారు. సుమారు పదేళ్ల కాలంలో ఓసీలు దాదాపు 10 శాతం సంపదను వృద్ధి చేసుకుంటే.. బీసీలు మాత్రం 9 శాతం సంపదను కోల్పొయారు.