calender_icon.png 27 November, 2024 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పన్ను వాటాల్లో దక్షిణాదికి వెన్నుపోటు

11-10-2024 02:54:59 AM

రాష్ట్రాలకు పన్నుల వాటాలు విడుదల చేసిన కేంద్రం

దక్షిణాది ఐదు రాష్ట్రాలకు కలిపి రూ.28,152 కోట్లు

ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికే అత్యధికంగా 31,963 కోట్లు

తొలిసారి అడ్వాన్స్ ఇన్‌స్టాల్‌మెంట్‌తో కలిపి విడుదల

తెలంగాణకు అక్టోబర్ జీఎస్టీ వాటా రూ.3,745 కోట్లు  

హైదరాబాద్, అక్టోబర్  10 (విజయక్రాంతి): ప్రగతి పథంలో పరుగులు పెడుతూ దేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా మారుస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర పన్నువాటాల్లో మళ్లీ తీవ్ర అన్యాయమే జరిగింది. ఏటా లక్షల కోట్ల పన్ను సమకూరుస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం లోని మోదీ సర్కారు తిరిపం వేసినట్లుగా నిధులు ఇస్తున్నదన్న ఆరోపణలున్నా యి.

వాటిని నిజం చేస్తూ అక్టోబర్ మాసానికి సంబంధించిన జీఎస్టీ పన్నుల వాటాలను గురువారం విడుదల చేసింది. దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు కలిపి రూ.28,152 కోట్లు ఇవ్వగా, ఉత్తరాదిలోని ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికే 31,962 కోట్లు ఇవ్వటం గమనార్హం. ఈసారి కేంద్రం అడ్వాన్స్ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా విడుదల చేసింది.

వాస్తవానికి ఈ నెల పన్ను ల వాటా కింద రాష్ట్రాలకు కేంద్రం రూ. 89,087 కోట్లను చెల్లించాల్సి ఉంది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో మూలధన వ్యయాన్ని వేగవంతం చేసే ఉద్దేశంతో అడ్వా న్స్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద రూ.89,086 కోట్లను కలిపి మొత్తం రూ.1,78,173 కోట్లు విడుదల చేసినట్లు  ఆర్థిక శాఖ వెల్లడించింది.  ఇందులో తెలంగాణకు దక్కింది రూ.3,745 కోట్లు మాత్రమే. అడ్వాన్స్ చెల్లించటంతో గత నెల కంటే ఈసారి రూ.2,431.84 కోట్లు అధికంగా వచ్చింది. 

యూపీకి రూ.31,962 కోట్లు 

పన్నుల వాటాలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.31,962 కోట్లు దక్కింది. మొత్తం నిధుల్లో ఇది 17.9 శాతం. దక్షిణాది ఐదు రాష్ట్రాలకు కలిపి ఇచ్చింది 15.8 శాతం మాత్రమే. అతి తక్కువగా గోవాకు 688 కోట్ల నిధులు విడుదల చేసింది. నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో 14 వాయిదాల్లో కేంద్ర పన్నుల వాటాను రాష్ట్రాలకు పంపిణీ చేయొచ్చు.

11 నెలల్లో 11 వాయిదాలతో పాటు మార్చిలో మూడుసార్లు పన్నుల వాటాను కేంద్రం విడుదల చేస్తూ వస్తోంది. అయితే ఈసారి రాష్ట్రాలను ఆశ్చర్యపరుసూ అడ్వాన్స్ ఇన్‌స్టాల్మెంట్ ను ప్రకటించింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర పన్నుల్లో 41 శాతాన్ని రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుంది.

కానీ 2024  ఆర్థిక సంవత్సరంలో 32.5 శాతం కేంద్ర పన్నులను రాష్ట్రాలతో పంచుకోవాలని ఆర్థిక శాఖ అంచనా వేసింది. దీని వల్ల సెస్, సర్‌ఛార్జీల్లో కూడా కేంద్రం నుంచి వాటా భారీగా తగ్గుతోందని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల తెలంగాణకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి ఈ సమస్యలను ప్రభుత్వం వివరించింది. కేంద్ర పన్నుల వాటాను 50 శాతానికి పెంచాలని ప్రతిపాదన పెట్టింది. 

రాష్ట్రాలకు అక్టోబర్‌లో 

జీఎస్టీ వాటాలు (రూ.కోట్లలో) 

రాష్ట్రం పన్నుల 

వాటా నిధులు

1. ఆంధ్రప్రదేశ్ 7,211

2. తెలంగాణ 3,737

3. అరుణాచల్ ప్రదేశ్ 3,131

4. అస్సాం 5,573

5. బీహార్ 17,931

6. గోవా 688

7. గుజరాత్ 6,197

8. హర్యానా 1,947

9. హిమాచల్‌ప్రదేశ్ 1,479

10. జార్ఖండ్ 5,892

11. కర్ణాటక 6,498

12. కేరళ 3,430

13. ఛత్తీస్‌గఢ్ 6,070

14. మధ్యప్రదేశ్ 13,987

15. మహారాష్ట్ర 11,255

16. మణిపూర్ 1,276

17. మేఘాలయ 1,367

18. మిజోరం 891

19. నాగాలాండ్ 1,014

20. ఒడిశా 8,068

21. పంజాబ్ 3,220

22. రాజస్థాన్ 10,737

23. సిక్కిం 691

24. తమిళనాడు 7,268

25. త్రిపుర 1,261

26. ఉత్తరప్రదేశ్ 31,962

27. ఉత్తరాఖండ్ 1,992

28. పశ్చిమబెంగాల్ 13,404