calender_icon.png 4 March, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ మొదటికి!

04-03-2025 01:30:24 AM

తవ్వకాలు జరిపినా కానరాని కార్మికుల జాడ

  1. ఎస్‌ఎల్‌బిసీ వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
  2. సొ‘రంగం’లోకి రోబో ఎంట్రీ తప్పేలా లేదు
  3. వినియోగంలోకి రాని కన్వేయర్ బెల్ట్

నాగర్‌కర్నూల్, మార్చి 3(విజయక్రాంతి): శ్రీశైలం టన్నెల్ ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ రోజురోజుకూ కష్టతరంగా మారుతోంది. గ్రౌండ్ పిరేట్రింగ్ సిస్టమ్(జీపీఆర్) ద్వారా ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు గుర్తించిన ప్రాంతా ల్లో మూడు రోజులుగా రెస్క్యూ టీం తవ్వకాలు జరిపినా నీటి ఊట, బురద తాకిడికి తవ్వేకొద్ది నీరు ఉబికి వస్తుంది.

ఘటన జరిగి 11 రోజులు కావొస్తున్నా కార్మికుల జాడ తెలియరాలేదు. రెస్క్యూ బృందాలు కార్మికులను సురక్షితంగా బయటికి తెచ్చేందుకు షిప్టుల వారిగా నిర్విరామంగా పనిచేస్తున్నారు. సొరంగంలోని 14వ కిలోమీటర్ వద్ద జరిగిన ఘటనతో 16 వేల టన్నుల బరువున్న టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) కూడా సుమారు వందమీటర్ల వెనక్కి తోసుకొచ్చింది.

భారీ శబ్దాలతో కూడిన నీటి ఊట, బురదతో సెగ్మెంట్లు కూలిపడి 13.5 కిలోమీటర్ వద్ద డేంజర్ జోన్‌గా మారింది. ప్రస్తుతం 12వ కిలోమీటర్ వరకే లోకో ట్రైన్ వెళ్లే అవకాశం ఉంది. అక్కడి నుంచి సహాయక బృందాలు నిచ్చెన, కన్వేయర్ బెల్ట్ సాయంతో నడుస్తూ ఘటనా స్థలికి వెళ్తున్నారు.

టీబీఎం మిషన్ పరిసరాల్లో 6 మీటర్ల లోతుల్లో నాలుగు, టీబీఎం మిషన్ కింది భాగంలో మరో నలుగురు కార్మికుల ఆనవాళ్లు గుర్తించిగా రెండు రోజులుగా తవ్వకాలు జరుపుతోంది. సోమవారం కూడా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ రెస్క్యూ బృందాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

జీపీఆర్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరిపారు. కానీ కార్మికుల ఆనవాళ్లు కనిపించక పోవడంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. టీబీఎం మిషన్ పరిసరాల్లో మరో నలుగురు ఉన్నట్టు అనుమానిస్తున్న స్థలంలో తవ్వకాలు జరపాలంటే సుమారు 8 నుంచి 9 మీటర్ల మట్టిని తవ్వాల్సి వస్తుంది.

తవ్విన మట్టిని బయటకు పంపే వెసులుబాటు లేకపోవడంతో తవ్విన చోటే మళ్లీ తవ్వాల్సి వస్తుంది. కన్వేయర్ బెల్ట్ మరమ్మత్తు పనులు కూడా మందకొడిగా సాగుతున్నాయి.

సొరంగంలోకి రోబోలు తప్పనిసరి కానుందా?

సొరంగం పైభాగంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం మల్లెలతీర్థం పరిసరాల్లోని ఉర్సువాగు, జిల్లెల వాగు, మల్లెలతీర్థం నుంచి కిందికి రెండు కొండల భాగంలో ఈ టన్నెల్ ప్రమాద స్థలం ఉన్నట్టు గుర్తించారు. అందులో భాగంగానే టన్నెల్‌లోకి నీటిఊట అధికంగా వస్తోందని నిర్ధారణకు వచ్చారు.

దీంతో జీపీఆర్ గుర్తించిన స్థలాల్లో తవ్వకాలు జరిపితే సొరంగంలో మట్టి దిబ్బలు కూలి మరింత ప్రమాదం పెరిగే ఆస్కారం ఉన్నట్టు రెస్క్యూ టీం బృందాలు ముఖ్యమంత్రికి వివరించాయి.

దీంతో ప్రాణనష్టం వాటిళ్లకుండా రోబోలను వినియోగించి సహాయక చర్యలు చేపట్టాలని నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బురద, నీటి ఊట ఉధృతి నేపథ్యంలో సొరంగంలోకి రోబోల వినియోగం తప్పేలా లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.