23-02-2025 12:46:14 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ గట్టు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని కపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సహాయక చర్యల్లో 24 మందితో కూడిన ఆర్మీ బృందం, 130 మంది ఎన్డీఆర్ఎఫ్, 120 మంది ఎస్డీఆర్ఎఫ్, 24 మంది హైడ్రా బృందం, 24 మందితో కూడిన సింగరేణి కాలరీస్ రెస్క్యూ టీమ్ పాల్గొన్నారు. ఘటనాస్థలంలో కూలిన మట్టి, నీటితో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు వెల్లడించారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 14వ కిలో మీటర్ వద్ద పైకప్పు కూలింది. సొరంగ మార్గంలో 13.5 కిలోమీటర్ వరకు వెళ్లిన సహాయ బృందాలు మరో అర కిలోమీటరు వెళ్లేందుకు మట్టి, నీటీతో అడ్డంకులను అధిగమించి ఘటనాస్థలానికి చేరుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నీటి ఉద్ధృతికి 80 మీటర్లు టన్నెల్ బోరింగ్ మిషన్ వెనక్కి రావడంతో 200 మీటర్లు గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ లోనే 8 మంది కార్మికులు చిక్కుకున్నట్లు సహాయ బృందాలు భావిస్తున్నాయి. చిక్కుకున్నవారిని పిలుస్తూ వారి స్పందన కోసం రెస్క్యూ టీమ్ యత్నిస్తున్నట్లు సమాచారం. పైకప్పు కూలడంతో మట్టితో కూరుకుపోయిన టన్నెల్ బోరింగ్ మిషన్ వెనుక భాగం రెస్క్యూ బృందాలకు కనిపించింది. టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది ఉద్యోగులు, కార్మికులు టీబీఎం ముందు భాగంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభమ్ గైక్వాడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎస్ఎల్బీసీ వద్ద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 20 నిమిషాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడారు. బాధితులను రక్షించేందుకు జరుగుతున్న చర్యలపై ఆరా తీశారు. ఘటన జరిగిన వెంటనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలానికి వెళ్లారని సీఎం తెలిపారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి వివరించారు. ఎస్ఎల్బీసీ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అభినందించిన రాహుల్ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలూ చేయాలని రేవంత్ రెడ్డికి సూచించారు.