calender_icon.png 17 October, 2024 | 5:00 AM

రికార్డుస్థాయి నుంచి వెనక్కి!

28-09-2024 12:00:00 AM

మార్కెట్ ర్యాలీకి బ్రేక్

264 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్

బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు

ముంబై, సెప్టెంబర్ 27: ప్రపంచ మార్కె ట్ల సంకేతాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో శుక్రవారం భారత స్టాక్ సూచీలు రికార్డుస్థాయిల నుంచి వెనక్కు తగ్గాయి. ట్రేడింగ్ తొలిదశలో  బీఎస్‌ఈ సెన్సెక్స్ 85,978 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పిన తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోన య్యింది.

దీనితో మధ్యాహ్న సెషన్ నుంచి నష్టాల్లోనే ట్రేడయ్యింది. చివరకు 264 పాయింట్ల క్షీణతతో 85,572 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  ఇంట్రాడేలో 26,277  పాయింట్ల వద్ద సరికొత్త రికార్డును నమోదు చేసిన అనంతరం 37 పాయింట్ల నష్టంతో 26,179  పాయింట్ల వద్ద నిలిచింది.

స్టాక్ సూచీల్లో అధిక వెయిటేజి కలిగిన బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో జరిగిన అమ్మకాలు మార్కెట్‌ను నష్టాలకు లోనుచేశాయి. ఈ వారం మొత్తంమీద సెన్సెక్స్ 1,027 పాయింట్లు, నిఫ్టీ 388 పాయింట్ల చొప్పున పెరిగాయి. ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంకాంగ్‌లు జోరుగా పెరిగాయి. యూరప్ సూచీలు పాజిటివ్‌గా ముగిసాయి. 

గరిష్ఠస్థాయిలో లాభాల స్వీకరణ

ఇటీవల జరిగిన భారీ ర్యాలీ జరిగిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు రికార్డుస్థాయిల వద్ద లాభాల స్వీకరణకు మొగ్గుచూపారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.

అంతర్జాతీయ సంకేతాలు అనుకూలంగా ఉన్నా, భారత్ మార్కెట్ పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యిందని, ట్రేడింగ్ తొలిదశలో ఐటీ షేర్లు సూచీలను రికార్డుస్థాయికి తీసుకెళ్లినా, బ్యాంకింగ్ షేర్లు ర్యాలీకి బ్రేక్‌వేశాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా వివరించారు. 

సన్ ఫార్మా టాప్ గెయినర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా సన్ ఫార్మా 2.6 శాతం పెరిగి రికార్డు గరిష్ఠస్థాయి రూ.1,948 వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టైటాన్, హెచ్‌సీ ఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్‌సర్వ్‌లు 1.7 శాతం వరకూ లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌డీ ఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, లార్సన్ అండ్ టుబ్రో, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్‌లు 3 శాతం వరకూ క్షీణించా యి. 

వివిధ రంగాల సూచీల్లో అధికంగా రియల్టీ ఇండెక్స్ 1.01 శాతం తగ్గింది. బ్యాంకెక్స్ 0.89 శాతం క్షీణించింది. యుటిలిటీస్ ఇండెక్స్ 0.82 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 0.79 శాతం, పవర్ ఇండెక్స్ 0.52 శాతం చొప్పున తగ్గాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 2.57 శాతం జంప్‌చేసింది.

ఎనర్జీ ఇండెక్స్ 2.12 శాతం, మెటల్ ఇండెక్స్ 1.02  శాతం హెల్త్‌కేర్ ఇండె క్స్ 0.70 శాతం చొప్పున లాభపడ్డాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచి 0.07 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.29 శాతం చొప్పున పెరిగాయి. 350 షేర్లు వాటి 52 వారాల గరిష్ఠస్థాయిల్ని నమోదు చేశాయి.