ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన కల్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘బేబి’. తాజాగా జరిగిన ఫిల్మ్‌ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ వేడుకలో ఈ సినిమాకు 5 అవార్డ్స్ దక్కాయి. 8 నామినేషన్లలో ఐదు పురస్కారాలు గెల్చుకుంది ‘బేబి’. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ సోమవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు.
మూవీ డైరెక్టర్ మారుతి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. “అవార్డ్స్ అంటే పెద్ద సినిమాలకే వస్తాయి చిన్న చిత్రాలకు రావు అని నిరాశ పడేవారికి ఉత్సాహాన్నిచ్చేలా ‘బేబి’కి ఇన్ని అవార్డ్స్ దక్కడం ఆనందంగా ఉంది. సినిమా చూశాక సాయి రాజేశ్ కమర్షియల్ మూవీని గొప్పగా చేశాడనిపించింది. ఆయనలో మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. అది రేపు బేబి హిందీ రీమేక్‌తో దేశమంతా తెలియాలని కోరుకుంటున్నా” అన్నారు.
హీరోయిన్ వైష్ణవి మాట్లాడుతూ.. ఫిలింఫేర్‌లో బేబి సినిమాకు నేను బెస్ట్ యాక్ట్రెస్‌గా పురస్కారం అందుకోవడం, మా మూవీకి 5 అవార్డ్స్ దక్కడం సంతోషంగా ఉంది’ అని తెలిపింది. ఇంకా ఈ వేదికపై మాట్లాడిన డైరెక్టర్ సాయి రాజేశ్, నిర్మాత ఎస్‌కేఎన్, కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగలినేని, లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్, సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్, సింగర్ శ్రీరామచంద్ర తమ అభిప్రాయాలను పంచుకున్నారు.