calender_icon.png 7 February, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమోసాల్లో కప్పపిల్లలు

07-02-2025 12:47:51 AM

  1. రైల్వేలో ఫుడ్ సేఫ్టీపై ప్రత్యేక చర్యలు తీసుకోండి
  2. అధికారులకు ఫిర్యాదు చేసిన రైల్వే వినియోగదారుల సంఘం సభ్యులు 

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్-కాచిగూడ మార్గంలో రైళ్లో ప్రయాణిస్తూ ఓ ప్రయాణికుడు సమోసాలు కొని తింటుంటే అందులో కప్పపిల్ల బయటపడిందని రైల్వే వినియోగదారుల సంఘం సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైళ్లలో ఎవరు పడితే వాళ్లు వచ్చి విక్రయిస్తున్న ఆహారపదార్థాల్లో నాణ్యత ఉండటం లేదని..దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

గురువారం సికింద్రాబాద్‌లోని హైదరాబాద్ భవన్‌లో హైదరాబాద్ డివిజనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ (డీఆర్‌యూసీసీ) సమావేశంలో ఆహార కల్తీపై రైల్వే వినియోగదారుల సంఘం సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సమావేశానికి హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేశ్ విష్ణోయ్ అధ్యక్షత వహించారు. 

ఈ సందర్భంగా సభ్యులు పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హంద్రి ఎక్స్‌ప్రెస్‌కు మలక్‌పేటలో స్టాపింగ్, విశాఖ-మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను కర్నూలు లేదా మంత్రాలయం రోడ్ వరకు పొడగింపు, షాద్‌నగర్, జడ్చర్లలో పలు ఎక్స్‌ప్రెస్‌లకు స్టాపింగ్‌పై అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఎంఎంటీఎస్ రైళ్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లవేళలకు అనుగుణంగా, ప్రయాణికుల సౌకర్యార్థం సవరించాలని కోరారు. అమృత్ భారత్ స్టేషన్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయడం, పలు రైళ్లకు స్టాపింగ్ ఏర్పాటు తదితర అంశాలను సభ్యులు అధికారుల దృష్టికి తీసుకుపోయారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి 2025 వరకు హైదరాబాద్ డివిజన్ సాధించిన విజయాలను, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎంపిక చేయబడిన స్టేషన్లలో పురోగతిలో ఉన్న పనులపై చర్చించారు. ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణ, వివిధ స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలకు సంబంధించి లిఫ్టులు, ఎస్కలేటర్ల ఏర్పాటు మొదలైన వాటి గురించి విజ్ఞప్తులను సమర్పించారు.