calender_icon.png 25 October, 2024 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి!

06-08-2024 03:39:05 AM

  1. రెండు నెలల్లోనే రెండు ఘటనలు 
  2. ఫైన్ వేసినా మారని ఆసుపత్రి తీరు 

నాగర్‌కర్నూల్, ఆగస్టు 5 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతిచెందింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్‌కర్నూల్ పట్టణానికి చెందిన సాయిఈశ్వర్ తన ఒక్కగానొక్క కూతరు కావ్య(25)ను హైదరాబాద్‌కు చెందిన తొండ ప్రశాంత్‌తో ఏడాది క్రితం వివాహం జరిపించారు. గర్భిణిగా ఉన్న కావ్య తల్లిగారింటి వద్దే ఉంటున్నది. సోమవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో కావ్యను నాగర్‌కర్నూల్‌లోని ప్రియాంక ఆసుపత్రిలో చేర్పించారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పరీక్షలు జరిపిన వైద్యులు.. సాయంత్రం బాబు పుట్టాడని చెప్పారు.

కావ్య పరిస్థితి విషమం గా ఉన్నదని, హైదరాబాద్‌కు తరలించాలని చెప్పి, అంబులెన్స్ ఏర్పాటు చేసి తరలించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసు పత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షలు జరిపి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రియాంక ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే కావ్య మృతిచెందిందని కుటుం బ సభ్యులు ఆరోపించారు. గత రెండు నెలల క్రితం ఇదే ఆసుపత్రికి టెస్టుల కోసం వచ్చిన ఓ గర్భిణికి సిబ్బంది ఇచ్చిన ఇంజక్షన్ వికటించి మృతి చెందింది. దీంతో జిల్లా వైద్యాధికారులు ఆసుపత్రిని సీజ్ చేసి, జరిమానా విధించారు. నెల రోజుల క్రితమే మళ్లీ తెరుచుకున్న ఆసుపత్రి.. మరో మృతికి కారణమవడం శోచనీయం.